ముంబాయి వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ సమరం ముగిసింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో… విండీస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే.. ఓ భారీ సిక్సర్ ద్వారా లక్ష్యాన్ని మించి మరో మూడు పరుగులు సాధించి.. వెస్టిండీస్ చాలా గర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.
భారత జట్టులో బౌలింగ్ లోపాలు మాత్రమే కాదు.. ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా కలిసి.. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మరింత జోరుగా చెలరేగిపోవడానికి కారణం అయ్యాయి. భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ చార్లెస్, రసెల్‌లు కొట్టిన రెండు భారీషాట్లను సునాయాసంగా క్యాచ్‌లు పకున్నారు. అయితే ఆ రెండు బంతులు కూడా నో బాల్లుగా తేలిపోవడం భారత్‌కు పెద్ద శాపం అనే చెప్పాలి.
ఒక దశలో చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన స్థితికి వెస్టిండీస్ చేరుకుంది. ఈ దశలో ఎటుచూసినా ఉత్కంఠ. అప్పటిదాకా విండీస్ బ్యాట్స్‌మెన్ ఎలాంటి బంతి వచ్చినా చితక్కొట్టేస్తున్నారు. ఈ దశలో బంతిని బౌలింగ్‌కు జడేజా చేతికి అందించారు. తొలి నాలుగు బంతుల్లో రెండే పరుగులు చేసినప్పటికీ.. అయిదో బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా రస్సెల్ తమ జట్టు మీద ఉన్న టెన్షన్ మొత్తాన్ని తుడిచిపెట్టేసినట్లుగా తుడిచేశాడు. ఆ సమయంలో 7 బంతులో 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాతి బంతిని కూడా రసెల్ బౌండరీకి తరలించడంతో వెస్టిండీస్ విజయానికి మరింత చేరువ అయిపోయింది. చివరి ఓవర్లో వారు చేయడానికి 8 పరుగులే మిగిలాయి. ఈ దశలో బంతి అనూహ్యంగా విరాట్ కొహ్లి చేతికి వచ్చింది. ధోనీ మ్యాజిక్‌ను నమ్ముకున్నాడు. అగ్రశ్రేణి బౌలర్లను కాదని పార్ట్‌టైం బౌలర్ కొహ్లి చేతికి బంతిని ఇచ్చాడు.
తొలి బంతి సింగిల్ మాత్రమే వచ్చింది. రెండో బంతి డాట్ బాల్. మూడో బంతి బౌండరీకి తరలిపోయింది. చివరి మూడు బంతులో ఇక చేయాల్సింది మూడే పరుగులు. కొహ్లి విసిరిన నాలుగో బంతిని రసెల్ భారీ సిక్సర్‌గా కొట్టి తమ జట్టు విజయాన్ని ఖరారుచేశాడు.
భారత ఇన్నింగ్స్
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. శిఖర్ ధావన్ స్థానంలో రహానే ఓపెనింగ్‌కు రోహిత్ శర్మకు జోడీగా వచ్చాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం అవుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మాత్రం గౌరవప్రదమైన స్కోరునే చేశాడు. 31 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. రహానే కూడా 35 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. శర్మ అవుట్ కాగానే బరిలోకి వచ్చిన విరాట్ కొహ్లి.. కాస్త కుదురుకోగానే… విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 47 బంతులో 89 పరుగులు సాధించాడంటే… ఏ రేంజిలో చెలరేగాడో అర్థంచేసుకోవచ్చు. ధోనీ చివర్లో వచ్చి 9 బంతులకు 15 పరుగులు చేశాడు. అందరూ సమష్టిగా రాణించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 192 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు కనబరిచిన దూకుడుతో తూకం వేసి.. భారత్ 214 పరుగులు చేయగలదని ప్రిడిక్టెడ్ స్కోరుగా నిపుణులు అంచనా వేసినప్పటికీ… 192 పరుగుల వద్ద భారత్ ప్రస్థానం ఆగిపోయింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్
విండీస్ ఇన్నింగ్స్‌లో క్రిస్‌గేల్ మీదనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని అంతా అనుకున్న మాట వాస్తవం. దానికి తగ్గట్లే తొలి ఓవర్లోనే 5పరుగులు రాబట్టి ఓ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రెండో ఓవర్ తొలిబంతికి పెవిలియన్ దారి పట్టాడు. అక్కడితో భారత శిబిరం విజయం సాధించేసినంతగా పండగ చేసుకుంది. కానీ వారికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ శామ్యూల్స్, చార్లెస్‌లు కూడా చెలరేగి ఆడారు. యాఫ్సెంచరీ తర్వాత చార్లెస్ అవుటయ్యాడు. తర్వాత బరిలోకి వచ్చిన సిమన్స్ వెస్టిండీస్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. విండీస్ జట్టులోని బ్యాట్స్‌మెన్ అందరూ కూడా సమష్టి ప్రతిభనే కనబరిచారు.
మొత్తానికి కొహ్లి వెర్సస్ గేల్ అంటూ ఇద్దరు వ్యక్తుల మధ్య మ్యాచ్‌గా అభివర్ణింప బడిన ఈ మ్యాచ్.. రెండు మంచి జట్టు ల మధ్య సమష్టి ప్రదర్శనలకు వేదిక అయిన మ్యాచ్‌గా మారింది. వ్యక్తులు సక్సెస్ అయినా, విఫలమైనా.. జట్టు ఆటను బట్టే విజయం ఉంటుందని తేలింది. వెస్టిండీస్ ఈడెన్‌లో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.