బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయని మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది నిజమవుతుందా అంటే… ఇప్పుడు క్రికెట్ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు చోటు లేకపోవడం చూసి.. నిజమేనని అనుకోక తప్పదు. ప్రపంచ క్రికెట్ ను ఒకప్పుడు శాసించిన వెస్టిండిస్ ఇప్పుడు అనామక దేశాల చేతుల్లో ఓడిపోయి.. కనీసం ప్రపంచక్ పు క్వాలిపై కాలేకపోయింది. ఈ ఏడాది చివరిలో భారత్ లో ప్రపంచకప్ జరగనుంది. ఇందులో ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఒక జట్టు, మరో ప్రపంచకప్ ప్రధాన టోర్నీకే ఎంపిక కాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రపంచకప్‌లో పది జట్లకు చోటు ఉంటుంది. ఇందులో ర్యాంకింగ్‌ల ఆధారంగా ఎనిమిది జట్లకు చోటు ఉంటుంది. క్వాలిఫయిర్ల ద్వారా రెండు జట్లు టోర్నీలోకి ఎంట్రీ ఇస్తాయి. పేలవమైన ప్రదర్శనతో వెస్టిండీస్ ర్యాంకుల్లో వెనుకబడగా.. క్వాలిఫయిర్లలోనూ పరాజయం పాలైంది. రెండుసార్లు 1975, 79 చాంపియన్ వెస్టిండీస్ జట్టు లేకుండా వన్డే వరల్డ్ కప్ జరగుతోంది. క్రికెట్లో వెస్టిండీస్‌ది ఓ చరిత్ర. ఆరివీర భయంకర ఆటగాళ్లు ఉన్న టీం. అయితే ఎంత ఎత్తుకు ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది.
1975, 79 వరల్డ్ కప్ గెలిచాక తిరుగులేని స్థానంలోఉన్న వెస్టిండీస్.. 1983లో జరిగిన వరల్డ్ కప్ లో విండీస్ ఫైనల్ లో టీమిండియాపై ఓడిపోయింది. అక్కడ నుంచి వెస్టిండీస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోతూ వచ్చింది. ఎంతలా మారిపోయిందంటే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి విండీస్ లేకుండా టోర్నమెంట్ జరగనుంది. వరుస ఓటములతో ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రేసు నుంచి వెస్టిండీస్ అవుట్ అయ్యింది. ముందు టెస్టుల్లో ప్రారంభమైన విండీస్ పతనం.. ఆ తర్వాత వన్డేల్లోను కొనసాగింది. ఒకప్పుడు సంప్రాదాయ క్రికెట్ ను ఏలిన విండీస్ జట్టు..
ఇప్పుడు కేవలం పొట్టి ఫార్మెట్ లోనే రాణిస్తుంది. అది కూడా మునపటిలా కాదు. 2016 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ జట్టు ప్రదర్శన మరింత తీసికట్టుగా మారింది. వెస్టిండీస్ బోర్డు కారణంగానే జట్టు ఇలా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ఆటగాళ్లకు డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం అంతర్గత రాజకీయాలు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించకపోవడం వంటి వాటితో నిర్వీర్యం అయిపోయింది. 2016లో టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే చాన్స్ ఉన్నా… నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు విండీస్ క్రికెట్ వైభవం చరిత్రలో కలిసిపోతోంది.