క్రికెట్ అంటే.. ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి… వెస్టిండీస్ చరిత్ర ఏంటో తెలుసు. ఆ జట్టు సాధించిన విజయాలు కానీ.. ఆ జట్టు ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డులు కానీ.. చెరిపితే చెరిగిపోయేవి కావు. క్రికెట్ రారాజులా ఓ సందర్భంలో ఆధిపత్యం చెలాయించిన విండీస్.. గత కన్నాళ్లుగా పతనం వైపుగా ఉంది. బ్రయాన్ లారా రిటైర్మెంట్ తర్వాత గుర్తు పెట్టుకునే ఒక్క ఆటగాడు కూడా.. విండీస్ నుంచి వెలుగులోకి రాలేదు. మంచి ప్రతిభావంతులని అనుకున్న కొంతమంది.. ఇలా వచ్చి అలామెరుపు తీగల్లా వెళ్లిపోయారు. జాతీయ జట్టుకు ఆడటం కన్నా..లీగ్ లలో ఆడుకోవడం బెటరని అనుకున్నారు. ఫలితంగా… ఆప్ఘనిస్థాన్ చేతిలో కూడా.. విండీస్ పరాజయం పాలయింది. ఇక ఓ గొప్ప చరిత్ర ముగింపు దశకు వచ్చిందని చాలా మంది అనుకున్నారు. కానీ..టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ తర్వాత… వెస్టిండీస్ మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగరడానికి ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం కలగక మానదు.
మూడు వన్డేల సిరీస్లో.. వెస్టిండీస్ ఓడిపోయింది. కానీ… అది అంతకు ముందులాంటి ఓటములు కావు. ఓ వన్డేలో గెలిచింది. మిగిలిన రెండు వన్డేలో… కడదాకా పోరాడింది. కొద్దిగా అటూ ఇటూ అయినా.. గెలుపు దక్కేదే. ఆఖరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఇప్పుడు వారి ఆటలో కనిపిస్తోంది. బ్యాటింగ్లో అత్యంత బలహీనం అనుకున్న జట్టు.. టీ ట్వంటీలోనే రెండు వందలకుపైగా పరుగులు చేసింది. మిగిలిన మూడు వన్డేలో.. వారి బ్యాట్స్మెన్స్ విఫలం కాలేదు. ఆ జట్టు బ్యాట్స్మన్లు పాత వెస్టిండీస్ రోజులను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు. క్రికెట్లో వెస్టిండిస్ చరిత్ర అంతం కాలేదని..నిరూపించే పట్టుదలను ప్రదర్శించారు.
కెప్టెన్ పొలార్డ్ కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తున్నాడు. హోప్, పూరన్, హెట్మయర్ వంటి ఆటగాళ్లలో విశ్వాసం నింపి.. ప్రపంచస్థాయికి తీసుకొస్తున్నాడు. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే… వెస్టిండీస్ మరో సారి.. అగ్రశ్రేణి జట్టుగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే.. విండీస్ దీవుల్లో.. క్రికెట్ కు ఆదరణ ఇంకా తగ్గలేదు. తమ జట్టు నిరాశజనక ప్రదర్శనతోనే.. అక్కడి అభిమానుల్లో నిర్లిప్తత కనిపిస్తుందేమో కానీ..విండీస్ ఆటగాళ్లు… తమదైన క్లాస్ చూపించడం ప్రారంభిస్తే.. విండీస్ ఫ్యాన్స్ నుంచి క్లాప్స్ రావడం ఖాయం.