దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని చిత్ర రంగానికి ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో పరిచయం చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా, శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా జనవరి 14, 2022 న విడుదలైంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. నిర్మాతకి ఎలాగూ థియేటర్స్ వున్నాయి కాబట్టి, అతని థియేటర్స్ లో కొన్నాళ్ళు ఈ సినిమాని నడిపించారు.
పెద్ద నిర్మాత అయిన దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని తన కుమారుడిలానే చూసుకొని, ఎంతో పెద్దగా లాంచ్ చెయ్యాలని చూసారు, కానీ అతని ప్రయత్నం మాత్రం ఫలించలేదని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా ఫలితం అనుకున్నట్టుగా లేకపోవటమే. ఇప్పుడు ఆశిష్ రెడ్డికి తదుపరి సినిమాలతో ఎలా అయినా విజయం ఇవ్వాలని, ఆశిష్ ని చిత్ర సీమలో ఒక మంచి నటుడిగా చూపించాలని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ‘సెల్ఫిష్’ అనే సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా కథానాయకురాలిగా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. దీనికి కాశి విశాల్ అనే అతను దర్శకుడు, ఇది అతనికి మొదటి సినిమా. ఆసక్తికరం విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా భాగస్వామి అవ్వడం. అతని సంస్థ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమాలో భాగం.
ఈ సినిమా చాలా అట్టహాసంగా మొదలుపెట్టి, షూటింగ్ కూడా చేశారు. కానీ మరి ఎందుకో ఈ సినిమా గురించి మాట్లాడకుండా నిర్మాత దిల్ రాజు ఒకరోజు సడన్ గా ‘లవ్ మి’ అనే సినిమాతో ప్రచారానికి ముందుకు వచ్చారు. ఇందులో ‘బేబీ’ సినిమాలో కథానాయకురాలిగా మెప్పించిన వైష్ణవి చైతన్య కథానాయకురాలిగా చేసింది. దీనికి అరుణ్ భీమవరపు దర్శకుడు, అతనికి కూడా ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారు, ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలవుతుంది అని కూడా అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. దేశంలో అత్యుత్తముల్లో ఒకరైన పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చి ఈ సినిమా ఆశిష్ కి విజయం ఇస్తుందని ఆశిష్ తండ్రి, అంకుల్ దిల్ రాజు ఆశలు పెట్టుకున్నారు. మరి ఇంతకు ముందు తీసిన ‘సెల్ఫిష్’ పక్కన పడినట్టేనా? ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడటం లేదు ఎందుకు? అందులో నటిస్తున్న ఇవానా పరిస్థితి ఏంటి? ఆమెకి తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయని కానీ దిల్ రాజు తో సినిమా చేసిన తరువాతే ఇంకో తెలుగు సినిమా చెయ్యాలన్న షరతు ఉండబట్టి చెయ్యలేకపోతోందని ఒక టాక్ పరిశ్రమలో వినపడుతోంది. ‘సెల్ఫిష్’ సినిమా సరిగ్గా రాలేదని, అందుకే దాన్ని షేల్వ్ చేసి ఈ ‘లవ్ మి’ ముందుకు తీసుకువచ్చారని ఇంకొక వాదన. ఇందులో నిజమెంతో దిల్ రాజుకే తెలియాలి.