కిరణ్ చేబ్రోలు అనే టీడీపీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు ఖండనార్హమే. రాజకీయాల్లో జుగుప్సాకరంగా మాట్లాడటం పార్టీలకతీతంగా ఖండించాల్సిందే. చర్యలు చేపట్టాల్సిందే. పొదుపుగా, హుందాగా మాట్లాడాలని హెచ్చరికలు జారీ చేయాల్సిందే. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై కిరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త హుందా పాలిటిక్స్ నిదర్శనంగా చెప్పొచ్చు.
కిరణ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఓ చర్చ ప్రారంభమైంది. కిరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూనే.. పార్టీల మధ్య రాజకీయ విమర్శలు పరిధి దాటి వ్యక్తిగతంగా కార్నర్ చేసే స్థాయికి ఎందుకు వెళ్లాయనే వాదన తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో క్లిన్ పాలిటిక్స్ జరిగేవి. రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నా అవి ఏనాడూ శృతిమించలేదు. లీడర్లు ఏనాడూ లైన్ క్రాస్ చేయలేదు. అసెంబ్లీ , బయట ఎక్కడైనా విమర్శల వాగ్భాణాలను సంధించి సమావేశాలను ఆధ్యంతం ఆసక్తికరంగా మార్చేవారు. అందుకే చంద్రబాబు, వైఎస్ ల మధ్య జరిగిన గతంలోని రాజకీయ సంభాషణ నుంచి స్ఫూర్తి పొందాలనే వాదన వైసీపీ అధికారంలోకి వచ్చాక విస్తృతంగా వినిపించింది.
వైసీపీ లీడర్లు ప్రత్యర్థి పార్టీల లీడర్లను కార్నర్ చేసేందుకు వ్యక్తిగతంగా కుటుంబాలను టార్గెట్ చేసేవారు. రాజకీయాలకు రంకును పులిమేవారు. అసహ్యకరంగా మాట్లాడేవారు. వైసీపీ నేతల భాషను చూసి ఇలాంటి నేతలనా చట్టసభలకు పంపింది అంటూ జనం సైతం మధనపడేవారు. బూతు భాషను రాజభాషను మార్చేశారు. అదే తరహాలో టీడీపీ కార్యకకర్త కిరణ్ అసహ్యకరంగా మాట్లాడారు.
అసహ్యకరంగా మాట్లాడితే సహించేది లేదంటూ ముందే చెప్పిన చంద్రబాబు ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కేసులు నమోదు చేయాలన్నారు . చకచకా అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. కిరణ్ అంతుచూస్తానని ఆ అరెస్టుకు అడ్డుపడే ప్రయత్నం చేశారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. గతంలో ఆ పార్టీ నేతలు వినియోగించిన భాష తమ దాకా వస్తే కానీ, ఆ నొప్పేంటో తెలుసుకోలేకపోయారన్న అభిప్రాయంకలుగుతోంది .