వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత శిబిరంలో ఉన్న వారంతా… పెయిడ్ ఆర్టిస్టులేనని.. వైసీపీ నేతలు చాలా రోజులుగా ఎగతాళి చేస్తూ వస్తున్నారు. సాక్షాత్తూ హోంమంత్రి కూడా.. కొద్ది రోజులుగా వెటకారం చేస్తూ వస్తున్నారు. అయితే.. ఇలా ప్రభుత్వమే పెయిడ్ ఆర్టిస్టులని చెప్పిన వారిని… పోలీసులు శిబిరానికి వచ్చి… స్వయంగా వారి వారి గ్రామాలకు తీసుకెళ్లి … శాంతిభద్రతలతో జీవించేలా భరోసా ఇచ్చి దింపి వచ్చారు. అప్పటి వరకూ తాము హేళన చేసిన వారి దగ్గరకు వెళ్లి.. వారి కష్టాలు విని.. గ్రామం నుంచి ఎందుకు బయటకు వచ్చారో తెలుసుకుని మరీ… తీసుకెళ్లి దింపి వచ్చారు. దాంతో.. వారెవరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదని ప్రభుత్వమే అధికారికంగా సర్టిఫికెట్ జారీ చేసినట్లయింది.
ప్రభుత్వమే మొదటి నుంచి సమస్యను రాజకీయంగా చూసి.. బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు సాధారణ ప్రజలతో పాటు… రాజకీయ పార్టీల నేతలనూ… ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి వందరోజులు మాత్రమే. ఈ స్వల్ప కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పదే పదే ఏపీలోని అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. మొదటగా.. ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం…ఢిల్లీలో స్థాయిలో కలకలం రేపగా… ఆ తర్వాత పీపీఏల రద్దు, జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో ఏపీ సర్కార్ తీరు, రాజధాని విషయంలో సొంత రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఏపీ సీఎం పక్కన పెట్టేశారన్న అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు… టీడీపీ నేతల గృహనిర్బంధం.. గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఉండటం …జాతీయ మీడియాకు సైతం.. న్యూస్ గా మారింది. ఓ మహా ఉద్యమం ఏదో జరగబోతోందన్నట్లుగా.. టీడీపీలో ఓ స్థాయి నేతల దగ్గర్నుంచి చోటా,మోటా నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం… అందర్నీ ఆశ్చర్యపరిచింది.
చంద్రబాబు బాధితుల్ని తీసుకుని ఆత్మకూరు వెళ్లినట్లయితే.. ఏం జరిగి ఉండేదో కానీ… ఆపడం వల్ల… ఏపీలో ఏదో జరుగుతోందన్న భావన మాత్రం.. దేశం మొత్తం వ్యాపించేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల్ని.. చాలా తక్కువ చేస్తూ… పెయిడ్ ఆర్టిస్టుల పేరుతో.. సొంత ప్రజల్ని అవహేళన చేస్తూ.. సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షం ఏదైనా సమస్యపై ఆందోళన చేస్తే.. అది టీడీపీకి చెందిన సమస్య అనో.. టీడీపీకి చెందినవారి సమస్య అనో ప్రభుత్వం.. చాలా తేలిగ్గా తీసుకుంటోంది. ఫలితంగా అలజడి ఏర్పడుతోంది.