ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతీ రంగంలో సలహాదారులు ఉన్నారు. అనధికార సలహాదారుల గురించి ఎవరికీ తెలియదు కానీ.. అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి.. కేబినెట్ ర్యాంక్‌తో జీతభత్యాలు ఇచ్చి.. పెద్ద ఎత్తున రస్ అల్ ఖైమా వ్యవహారాలు చూసుకోవడం దగ్గర్నుంచి ప్రజారోగ్యం వరకూ.. అనేక అంశాలపై సలహాలివ్వడానికి .. సలహాదారుల్ని నియమించారు. ప్రస్తుతం ఇప్పుడు.. ఏపీలో కరోనాపై ఓ సునామీ లాంటి వ్యవహారమే నడుస్తోంది. దేశం మొత్తం అప్రమత్తమైపోతే.. ఏపీ మాత్రం.. తమకు కరోనా రాదని.. డిసైడయిపోయింది. అయితే కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి కదా… ప్రభుత్వానికి ఆ జాగ్రత్తలపై సలహాదారులు కూడా… కనీస జాగ్రత్త సలహాలు కూడా ఇస్తున్నట్లుగా లేదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు.. డాక్టర్ చేకుపల్లి శిల్ప అనే ఆమెకు… వైద్యశాఖ సలహాదారు పదవి ప్రకటించారు. ఈమె ఎవరు..? వైద్య రంగంలో ఎలా నిపుణులు..? ఎక్కడ పని చేశారు..? లాంటివి ఎవరికీ తెలియదు. కానీ ఆమెకు.. ఏకంగా ఏపీ ముఖ్యకార్యదర్శి హోదాలో సలహాదారు పదవిని ఇచ్చేశారు. ఏపీ ముఖ్యకార్యదర్శి హోదా అంటే.. ఐఏఎస్ అధికారి మాత్రమే నిర్వహించే విధి. అయినప్పటికీ.. చేకుపల్లి శిల్పకు పదవి ఇచ్చారు. ఈమె ఏపీ కూడా కాదు. ఈమె తెలంగాణకు చెందిన డాక్టర్. అంతే కాదు.. అసలు ప్రభుత్వం ఢిల్లీ నుంచే పని చేయాలని సూచించింది. ఏపీ ప్రజల కోసం ఢిల్లీ నుంచి ఆరోగ్య సలహాదారు ఎలా పని చేస్తారో.. ప్రభుత్వానికే తెలియాలి. పైగా ఏపీ ముఖ్యకార్యదర్శి హోదా అంటే… పెద్ద ఎత్తున జీతభత్యాలు కూడా అందుతూంటాయి. మరి కరోనా లాంటి విపత్తు వచ్చిన సమయంలో.. ఆమె తాను తీసుకుంటున్న జీతభత్యాలకు ఏమైనా న్యాయం చేశారా..? ముఖ్యమంత్రికి ఏమైనా సలహాలిచ్చారా అంటే.. ఏ మాత్రం క్లారిటీ లేదు.
పదవి పొందిన తర్వాత.. సలహాదారుల చేకుపల్లి శిల్ప.. ఏపీని సందర్శించారో లేదో… కూడా ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏమైనా సూచనలు.. చేశారా అన్నదానిపైనా స్పష్టంత లేదు. చివరికి కరోనా విజృంభణ సమయంలో ఏమైనా… సాయం చేస్తున్నారా.. అంటే అదీ లేదు. మరి ఈ సలహాదారులకు.. పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును జీతభత్యాలుగా ఇచ్చి… ఎందుకు పోషిస్తున్నారో.. మాత్రం సస్పెన్స్. అన్నట్లు.. ఈ సలహాదారు శిల్ప.. తెలంగాణకు చెందిన చెందిన శ్రీరామ్‌రెడ్డి అనే బీజేపీ నేత భార్య.