ఇప్పుడు అందరూ చెరువులు, హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఎఫ్టీఎల్ అంటే ఏమిటి.. బఫర్ జోన్ అంటే ఏమిటి అన్నదానిపై చాలా మందికి క్లారిటీ ఉండటం లేదు. చెరువులకు ఈ రెండు మార్కింగులు ఉంటాయి. ఆ హద్దుల్లో శాశ్వత నిర్మాణాలు చేసుకోకూడదు. అవి పట్టాభూములు అయినా సరే.
ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. ట్యాంక్ నిండితే ఏ లెవల్‌కు వస్తుందో ఆ లెవల్ వరకూ నిర్మాణాలకు చాన్స్ ఉండదు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో నిర్మాణాలు చేసుకోవడానికి ఉండదు. వ్యవసాయం చేసుకోవచ్చు. దీన్ని పట్టించుకోకుండా ఎఫ్టీఎల్ లో నిర్మాణం చేపడితే.. ఆ నిర్మాణాన్ని కూలగొట్టి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. సాధారణంగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు.. అంటే వంద అడుగుల వరకు ఎలాంటి నిర్మాణానలకు అనుమతి ఉండదు చెరువు 25 హెక్టార్ల కన్నా పెద్దది అయితే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు.
ఎఫ్టీఎల్ తరువాత నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ గా చెప్పవచ్చు. చెరువు నిండిపోయి అలుగు పారుతుందనే మాటల్ని మనం తరచూ వింటూంటాం. ఈ అలుగు పారే ప్రాంతాన్ని బఫర్ జోన్ గా భావిస్తారు. అంటే చెరువు నిండిపోయి నీరు పారే ప్రాంతం .. బఫర్ జోన్. ఇందులో నిర్మాణాలు ఉంటే… నీరు పోవడానికి సమస్య ఏర్పడి మునిగిపోతుంది. ఈ బఫర్ జోన్ ఎంత ఉంటుందనేది అధికారులు నిర్ధారిస్తారు.
చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను మున్సిపల్ అధికారులు, నీటి పారుదల శాఖ నిర్ణయిస్తారు. అయితే అధికారులు కూడా ఇష్టారాజ్యంగా నిర్ణయించలేరు. స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.