విధుల్లోకి రానివారు ఉద్యోగాల్లో కొనసాగరని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వారిని సిబ్బందిగా ఆర్టీసీ పరిగణించే ప్రసక్తే ఉండదనీ, అలాంటప్పుడు యూనియన్లు ఎలా ఉంటాయనీ, భవిష్యత్తులో యూనియనిజం అనేదే ఉండదని సీఎం అంటున్నారు. ఆయన లక్ష్యం కార్మికులకు సంఘటితమయ్యే అవకాశం లేకుండా చేయడం అనేది అర్థమౌతోంది! దీంతోపాటు, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం మీద కూడా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఉండి తీరాల్సిందేననీ, అందుకే పూర్తిగా ప్రైవేటీకరించాలని అనుకోవడం లేదన్నారు. పాక్షికంగానే ప్రైవేటీకరణ ఉంటుందనీ, ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయనీ వీటిలో 50 శాతం ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయన్నారు. 30 శాతం బస్సులు అద్దెకి తీసుకుంటామనీ, ఇవీ ఆర్టీసీ పాలన కిందే ఉంటాయన్నారు. మిగిలిన 20 శాతం మాత్రమే ప్రైవేటు బస్సులన్నారు.
30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు బస్సులు… ఈ ప్రతిపాదనలు ఏరకంగా చూసుకున్నా లాభదాయకంగా కనిపించడం లేదు! అద్దె బస్సుల్ని మరింత పెంచితే ఆర్టీసీకి మరిన్ని నష్టాలు వచ్చే అవకాశమే ఉంది. ఒక రూట్లో ఒక ట్రిప్పు ఆర్టీసీ సొంత బస్సు నడిస్తే… అద్దె బస్సుతో పోల్చితే, దీని కంటే దాదాపు రెండున్నర వేల రూపాయలు ఎక్కువగా వసూలు అవుతోందని ప్రముఖ విశ్లేషకులు కె. నాగేశ్వర్ చెబుతున్నారు. ఆ మేరకు అద్దె బస్సుల వల్ల ఆర్టీసీకి నష్టమే అంటున్నారు. ప్రైవేటు సంస్థలకు కొన్ని బస్సులు ఇస్తామంటున్నారు. అయితే, కేవలం లాభాలు వచ్చే రూట్లలో మాత్రమే ప్రైవేటు బస్సులు తిరగడానికి మొగ్గుచూపుతాయి. నష్టాలను వారెందుకు భరిస్తారు? ఆరకంగా ప్రైవేటు వల్ల లాభాలొచ్చే రూట్లను ఆర్టీసీ కోల్పోవాల్సి రావొచ్చు. దాని వల్ల ఆర్టీసీకి ఎలా లాభం అవుతుంది?
అసలు సమస్య ఎక్కడుందంటే… ప్రజా రవాణాను లాభనష్టాల కోణం నుంచి ప్రభుత్వం చూస్తుండటమే! ప్రజలకు విద్య, వైద్యం అందించడం ఎలాగైతే ప్రభుత్వ కనీస బాధ్యతో… ప్రజా రవాణా సదుపాయాల్నీ కూడా అలానే చూడాలి. రాయితీలు ఇవ్వాలి, సదుపాయాలు పెంచాలి. అంతేగానీ… లాభాలు రావడం లేదు అనడం సరైంది కాదు. పాఠశాలలు నిర్వహించడం వల్ల లాభాలు రావట్లేదు, హాస్పిటల్స్ వల్ల లాభాలు రావడం లేదని ప్రభుత్వం అన్లేదు కదా? ప్రజా రవాణా సదుపాయాల కల్పననీ అదే దృక్పథంతో చూడాలి. కానీ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకునే యోచనలో కేసీఆర్ సర్కారు లేదు. సంస్థ అలానే ఉండాలంటారు, లాభాల్లోకి తెస్తామంటారు, ప్రైవేటు, అద్దె బస్సుల వల్ల ఎలా లాభమో స్పష్టంగా వివరించలేకపోతున్నారు!