ఏపీలో రాజకీయ పొత్తుల విషయంలో బీజేపీ టీడీపీ,జనసేనతో కలుస్తామని సంకేతాలు పంపుతున్నారు. కానీ ఇప్పుడే మాట్లాడబోమని.. చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఆయన నోటి వెంట ఒకటే మాట వినిపిస్తోంది..అదేమిటంటే రాష్ట్ర ప్రయోజనాలు. వాటిపై హామీ లభిస్తే పొత్తుకు ఆయన సిద్ధంగా ఉంటారని అంటున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాలేమిటి అన్నది సస్పెన్స్ గా మారింది.
వైసీపీకి బీజేపీ దగ్గర కాదని నిరూపించుకోవాలన్నది టీడీపీ చెబుతున్న రాష్ట్ర ప్రయోజనాల్లో ఒకటి. అలా నిరూపించుకోవాలంటే.. అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శలకు అనుగుణంగా..ఏపీలో పరిస్థితులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, అచ్చెన్నాయుడు నేరుగానే చర్యలెప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. డిల్లీ లిక్కర్ స్కాం తరహాలో.. ఏపీలో లిక్కర్ పాలసీపై విచారణ చేయించడం.. వివేకా హత్య కేసులో సీబీఐ పై ఒత్తిళ్లు లేకుండా చేయడం వంటివి టీడీపీ డిమాండ్ల లో ఉండవచ్చని అంటున్నారు.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరిపి .. అక్రమంగా చేసిన అప్పుల లెక్కలు తేల్చాలన్నది కూడా ఓ షరతు అయి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ విషయంలో బీజేపీ సాఫ్ట్ గా ఉంది. టీడీపీ పెట్టిన డిమాండ్లను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో వీలైనంతగా సహకరిస్తోంది కూడా. అందుకే బీజేపీతో పొత్తు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు మొదట్లోనే తుంచేస్తున్నారు. టీడీపీ ఎన్డీఏలోకి రావాలంటే… టీడీపీ చెప్పిన రాష్ట్ర ప్రయోజనాలను నేరవేర్చాల్సి ఉంటుంది.లేకపోతే పొత్తులుండకపోవచ్చు.