లైగర్ పూరికి గట్టి దెబ్బే కొట్టింది. ఇస్మార్ట్ శంకర్‌తో ఫామ్‌లోకి వచ్చాడనుకొన్న పూరి.. లైగర్‌తో ఒక్కసారి నాలుగు అడుగులు వెనక్కి వేశాడు. చేతిలో ఉన్న జనగణమన కూడా ఆగిపోయింది.ఇప్పుడు మరో హిట్ తో… తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయం పూరికి కూడా తెలుసు. అందుకే లైగర్ రిలీజ్ అవ్వగానే.. ముంబై వెళ్లిపోయాడు. అక్కడ మరో సినిమా పనుల్లో పడిపోయాడు. పూరి ఇప్పుడు ఓ స్క్రిప్టు తయారు చేస్తున్నాడు. అందుకోసం ఓ హీరో కావాలి. లైగర్ సమయంలోనే… సల్మాన్ ఖాన్‌తో పూరి భేటీ వేశాడు. షారుఖ్ కూడా పూరిని పిలిపించుకొని కథ చెప్పించుకొన్నాడు. లైగర్ హిట్టయితే… అటు సల్మానా, ఇటు షారుఖా.. అనే డైలామా ఉండేది. అయితే లైగర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఆ ఇద్దరు ఖాన్లూ పూరిని నమ్మడం కష్టం. అయితే పూరి మాత్రం బాలీవుడ్ నుంచే నరుక్కొద్దామని చూస్తున్నాడు. బాలీవుడ్ హీరోల్లో ఒకరికి కథ చెప్పి, ఓకే చేయించుకోవాలన్నది పూరి ప్రయత్నం. పెద్ద హీరో దొరికితే రెమ్యునరేషన్ లు లేకుండా రూ.100 కోట్లలో సినిమా పూర్తి చేసి సేఫ్ గేమ్ ఆడాలనుకొంటున్నాడు.
పూరితో వంద కోట్ల సినిమా అంటే పెద్ద మేటరేం కాదు. తానే సొంతంగా సినిమా తీయగలడు. సో… తదుపరి సినిమాకి హీరో దొరకడమే ఆలస్యం. మరోవైపు టాలీవుడ్ లో అయితే బాలకృష్ణతో పూరికి మంచి రాపో ఉంది. తనకు కథ చెప్పడం.. ఓ ఫోన్ కాల్ దూరమంతే. పైసా వసూల్ తరవాత పూరితో మరో సినిమా చేయాలని బాలయ్య కూడా ఉత్సాహం చూపించాడు. తనకు లైగర్ రిజల్ట్ పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. కాకపోతే.. బాలయ్య కాల్షీట్లు ఇవ్వాలంటే చాలా కాలం ఎదురు చూడాలి. పూరి చేతిలో ఉన్న చివరి ఆప్షన్… ఆకాష్ పూరితో సినిమా చేయడమే. ఆకాష్ కెరీర్‌ని సెట్ చేయాలని చాలా కాలంగా భావిస్తున్నాడు పూరి. ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. ఒకట్రెండు నెలల్లో కథ కుదిరి, హీరో దొరికితే… పూరి పెద్ద ప్రాజెక్టే టేకప్ చేస్తాడు. లేదంటే ఆకాష్‌కి తగిన కథని రెడీ చేసి.. పట్టాలెక్కిస్తాడు. ఇది మాత్రం క్లియర్.