తొలి సినిమాతోనే తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు టాలీవుడ్ లో చాలా మంది వున్నారు. ‘శివ”తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ”నిన్నే పెళ్ళాడుతా” లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను డీల్ చేసి వెండితెరపై తనదైన ముద్రవేశాడు కృష్ణ వంశీ. ‘ఐతే’తో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అని పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. ”ఆనంద్” చూసిన తర్వాత ఎవరీ శేఖర్ కమ్ములా ? అని మాట్లాడుకున్నారు అంతా. ”ఆర్య” చూసి సుకుమార్ సూపర్ అన్నారు. ‘గమ్యం’తో తన డెప్త్ ఏమిటో చూపించాడు క్రిష్. ఇలా చెప్పుకుంటూ పొతే తొలి సినిమాతోనే తమ స్టాంప్ వేసుకున్న దర్శకులు చాలా మందే వున్నారు. ఇప్పుడీ లిస్టు లో ”ఘాజీ” దర్శకుడు సంకల్ప్ రెడ్డిని చేర్చాల్సిందే.
ఘాజీ సినిమా చూసిన తర్వాత సంకల్ప్ రెడ్డిని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అసలు అలాంటి థాట్ ను తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. అందులోనూ సంకల్ప్ కొత్త దర్శకుడు. తలపండిన దర్శకులే ఇలాంటి సబ్జెక్ట్స్ జోలికి వెళ్లారు. చరిత్ర , అందులోనూ దేశ రక్షణ వ్యవస్థ, దేశభక్తి తో ముడిపడి వున్న ఇలాంటి కధను టచ్ చేయాలంటే గట్స్ వుండాలి. ఘాజీతో ఒక దర్శకుడిగా తన స్టామినా ఏమిటో చప్పకనే చెప్పేశాడు సంకల్ప్. నిజంగా ఇది అవుట్ స్టాండింగ్ సినిమా. ఒక దర్శకుడి సినిమా. దర్శకుడు, స్క్రిప్ట్ .. ఈ రెండు ఈ సినిమాకి అసలైన హీరోస్. దాదాపు సినిమా అంతా ఒక సబ్మెరైన్ లోనే జరుగుతోంది. సినిమా రూల్స్ ప్రకారం అయితే ఇన్ని కెమరా ల్యాండింగ్స్ వుండాలి. ఇలాంటి షాట్ డివిజన్ వుండాలి అనే లెక్కలు వుంటాయి. కాని దర్శుడు తనదైన స్క్రీన్ ప్లేతో అదే లొకేషన్ లో సినిమాని ఆద్యంతం రక్తికట్టించేశాడు. ఒకే లొకేషన్ లో సినిమా జరుగుతోంది అనే భావాన ప్రేక్షకుడికి కలగలేదు అంటే ఇది దర్శకుడి గొప్పదనమే. అన్నిటికికంటే ముఖ్యంగా ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయడం. ఈ విషయంలో దర్శకుడిగా వందకు వందమార్కులు కొట్టేశాడు సంకల్ప్. దేశభక్తి లాంటి సబ్జెక్టు ను డీలా చేయాలంటే బలమైన భావోద్వేగాల్ని పడించాలి. ఈ విషయంలో సంకల్ప్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమాని ఆద్యంతం వీక్షించిన ప్రేక్షకులు అసంకల్పింతంగా ‘జైహింద్’ అంటూ నినాదం ఇస్తూ బయటకి వస్తున్నారంటే భావోద్వేగాల్ని ఏ స్థాయిలో పండించారో అర్ధం చేసుకోవచ్చు.
మొత్తంమ్మీద తెలుగు సినిమా పరిశ్రమకు మరో వైవిధ్యమైన దర్శకుడు దొరికాడు. ఘాజీ సినిమా ప్రేక్షకుల అభిప్రాయం ఇది. అసలు ఇలాంటి సబ్జెక్ట్ ను ఒక టాలీవుడ్ దర్శకుడు, అందులోనూ అప్ కమింగ్ డైరెక్టర్ డీల్ చేయడం నిజంగా అభినందనీయం. తొలి సినిమాతోనే తన మార్కు ను చాటుకున్నాడు సంకల్ప్ రెడ్డి. అయితే దీని తర్వాత సంకల్ప్ ప్రయాణం ఎలా సాగుతుందో అన్నది ఆసక్తికరం. సంకల్ప్ మాటలు వింటే అసలు రెగ్యులర్ సినిమా తీసే మూడ్ లో లేడనిపిస్తుంది. వైవిధ్యమైన సినిమాలే అంటున్నాడు సంకల్ప్. ఇది మంచి పరిణామం. ఇప్పటికే కొన్ని డిఫరెంట్ లైన్స్ ను సిద్ధం చేసుకున్నాని అంటున్నాడట సంకల్ప్. ఘాజీ చూసిన తర్వాత సంకల్ప్ పై తప్పకుండా గురి కుదురుతుంది హీరోలకు. అటు ప్రేక్షకులు కూడా సంకల్ప్ నుండి ఇలాంటి వైవిధ్యమే కోరుకుంటారు. మరి, రెండో సినిమాగా సంకల్ప్ ఎంతటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తారో అన్న ఆసక్తి నెలకొందిప్పుడు.