వై నాట్ 175 అంటూ బీరాలు పలికిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి కారణం ఏమిటి..? రాజకీయాల్లో గెలుపోటములు సహజమే కానీ, 150 స్థానాల నుంచి 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందటానికి దారితీసిన పరిణామాలు ఏంటి…? తెలంగాణలో కేసీఆర్ ను ఓడించిన అహంకారమే ఏపీలో జగన్ ను నేలచూపులు చేసేలా చేసిందా..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న బిగ్ డిస్కషన్ ఇదే. వై నాట్ 175 అంటూ డైలాగ్ లు కొట్టిన వైసీపీ ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవం చవిచూసింది. కౌంటింగ్ మొదలైన సమయం నుంచి ఏ దశలోనూ వైసీపీ కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో జగన్ పార్టీకి ఎందుకీ దుస్థితి పట్టిందనే చర్చ జరుగుతోంది. అయితే, వైసీపీ ఘోర పరాజయానికి జగన్ నిర్ణయాలే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జగన్ సీఎం కాగానే ప్రజా వేదికను కూల్చి విధ్వంసానికి తెరలేపారని అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోకుండా అహంకారంతో ముందుకు వెళ్ళడమే ఈ ఫలితాలకు కారణమని అభిప్రాయపడుతున్నారు. తన చుట్టూ సలహాదారులను పెట్టుకొని వారి సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంతో తన గోతిని తనే తవ్వుకున్నారని అంటున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా మూడు రాజధానుల నిర్ణయం ఎంత వివాదాస్పదం అయినా దానికే కట్టుబడి ఉండటం పట్ల పలు జిల్లాలో ఫ్యాన్ రెక్కలను ముక్కలు చేశారు ఏపీ ప్రజలు.
అమరావతి రైతులను ఆందోళనలను పట్టించుకోకుండా పోవడం, రైతుల వద్దకు మంత్రులను, ఎమ్మెల్యేలను పంపకపోవడం, వారిని పిలిచి చర్చించకపోవడంతో వారి ఆగ్రహాన్ని ఈ ఎన్నికల్లో స్పష్టంగా చూపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇసుక దోపిడీ, కొట్లాడి ప్రత్యేక హోదా తీసుకొస్తామని కేంద్రానికి తన కేసుల కోసం జగన్ సరెండర్ కావడం.. వైసీపీ పట్ల ప్రజల్లో అసహనం పెంచేశాయి.
పైగా..కొడాలి నాని, వల్లభనెనీ వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజాల నోటి దురుసు వ్యాఖ్యలు కూడా వైసీపీ పతనానికి ఓ కారణం. అదే సమయంలో పొలిసు వ్యవస్థతో ప్రతిపక్ష నాయకులను వేధింపులకు గురి చేయడం, హత్యా ఆరోపణలు, బెదిరింపులు… దీంతోపాటు ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబును అరెస్ట్ చేయించడం , పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఇవన్నీ జగన్ ను మాజీ సీఎంగా చేశాయని అంటున్నారు.