ఒకప్పుడు సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు మళ్లీ ఇన్నేళ్లకు తెర మీదికి వచ్చింది. హైదరాబాద్‌లో దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో అయేషా మీరా హత్యాచారం కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలోనే అంటే 2007లో హాస్టల్లో అయేషా మీరాపై అత్యాచారం, ఆపై హత్య జరిగాయి. అప్పట్లో ఇది ఎంతో సంచలనం సృష్టించింది. కాని అసలు నిందితుడు ఎవరో ఇప్పటివరకు తేలలేదు. తేలలేదు అనడం కంటే తేల్చలేదు అనడం సమంజసం.
అప్పటి వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రముఖ నాయకుడి మనుమడే అయేషా మీరా హత్యాచారం కేసులో నిందితుడని ఆరోపణలు వచ్చాయి. ఈమధ్య జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఓ జర్నలిస్టు కూడా ఇది వాస్తవమని, కాని నిందితుడిని బయటకు రాకుండా ఆనాటి ప్రభుత్వం మేనేజ్ చేసిందని చెప్పాడు. ఒకప్పుడు సినీనటి ప్రత్యూష మృతి కేసులోనూ నిందితులు ఎవరో ఈనాటివరకు ప్రపంచానికి తెలియలేదు. ఆమెది హత్యో, ఆత్మహత్యో తెలియలేదు. అయేషాపై అత్యాచారం జరిగిందని, ఆపై హత్య చేశారని ప్రపంచానికంతా తెలుసు. ఈ పని ఎవరు చేశారో కూడా తెలుసు. కాని నిందితుడిని తప్పించేశారు. సత్యం బాబు అనే అమాయకుడిని పట్టుకొచ్చి అతన్ని చిత్రహింసలు పెట్టి బలవంతంగా నేరం చేసినట్లు ఒప్పించారు.
అతను జీవచ్ఛవంలా మారిన తరువాత హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అప్పట్లో అయేషా తల్లిదండ్రులు సత్యం బాబు అమాయకుడని, ఈ కేసుతో అతనికి సంబంధం లేదని చెప్పారు. నిందితుడిని పట్టుకున్నామని ప్రకటించిన పోలీసు అధికారిని ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆ తరువాత మరో పోలీసు అధికారిని కూడా అదే పని చేశారు. 2018లో ఈ కేసు సీబీఐకి అప్పగించగా సీబీఐ అధికారులు ఈరోజు అయేషా మీరా మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం చేయించారు. సీబీఐ కేసు దర్యాప్తు చేస్తున్నంతమాత్రాన తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని అయేషా తల్లి చెబుతోంది. తన కూతురు హత్య జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం కేసు మాఫీ కోసం డబ్బు ఎర చూపిందని, డబ్బు తీసుకొని కొందరు తమ ఇంటికి వచ్చారని తల్లి ఓ టీవీ ఛానెల్ చర్చలో చెప్పింది. పన్నెండేళ్లుగా తాము పోరాటం చేస్తున్నామంది.
ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘దిశ చట్టం’ కింద మొదటిగా ఈ కేసును టేకప్ చేయాలని కోరుతోంది. ఇప్పుడు జరుగుతున్న సీబీఐ విచారణలో రాజకీయ నాయకులెవరూ తలదూర్చకుండా ఉంటే న్యాయం జరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఈరోజు ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ఓ విషయం ఆసక్తికరంగా ఉంది. అయేషా ఘటన జరిగినప్పుడు ప్రస్తుత వైకాపా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా టీడీపీలో ఉంది. అప్పట్లో ఆమె అయేషా తల్లిని కలుసుకొని మాట్లాడింది. ప్రస్తుత ఇంటర్వ్యూలో అయేషా తల్లి “ఘటన జరిగినప్పటినుంచి ఇప్పటివరకు నాలుగు ప్రభుత్వాలను కలిసినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా ఏం జరగదు. అయేషా కేసులో న్యాయం చేయాలని ఇప్పుడు అసెంబ్లీలో రోజా సీఎం జగన్‌ను అడిగితే చాలు న్యాయం జరిగినట్లే. ఆయన చేస్తారు. మీడియా ద్వారా అదే విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నది.
అయేషా ఘటన జరిగినప్పుడు రోజా ఆమెతో ఏం మాట్లాడింది? ఇప్పుడు రోజా చెబితే జగన్ ఎందుకు చేస్తారు? ఈ కేసు గురించి జగన్ తెలియదని అనుకోలేం. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయేషా కేసును నీరుగార్చగా, ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా వరంగల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ పోసిన ముగ్గురు యువకులను ఎన్కౌంటర్ చేశారు. ఈ పని చేసింది దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయించిన సజ్జనారే. అయేషా మీరా హత్యాచార ఘటనలో నిందితుడిని ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టలేదనేది అర్థమవుతోంది. ఇందుకు ఏం చేయాలో అంతా ఆనాడు చేశారు. మరి ఇన్నేళ్ల తరువాత ఇప్పుడేం జరుగుతుంది?