న్యాయస్థానం ద్వారా శాసనసభ స్పీకరు విధులను నిర్దేశించడం అనే కీలక పరిణామానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సాగిస్తున్న పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్లు లెక్క. ఇవాళ హైకోర్టు ఆమె పిటిషన్ విషయంలో తీర్పు వెలువరించాల్సి ఉంది. శాసనసభ స్పీకరు తీసుకున్న నిర్ణయంపై ఇదివరకు చాలా కేసుల్లో.. ‘స్పీకరు విధుల్లో మేం జోక్యం చేసుకోలేం’ అనే తరహా తీర్పులు మాత్రమే వచ్చాయి. అయితే ఆ కేసులకు ప్రస్తుతం రోజా కేసుకు చాలా వ్యత్యాసం ఉంది.
అవన్నీ ఫిరాయింపుల నేపథ్యంలో సభ్యుల మీద వేటు వేయడానికి సంబంధించి స్పీకరు తన విచక్షణాధికారం మేరకు వ్యవహరించగల కేసులు. రోజా వ్యవహారం అలా కాదు. రాజ్యాంగ బద్ధంగా శాసనసభకు సంబంధించిన రూల్ బుక్ ప్రకారం తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన కేసు. అయితే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన నాడు ఉదాహరించిన రూలుకు, బుధవారం నాడు కోర్టులో స్పీకరు తరఫు న్యాయవాది ప్రస్తావించిన రూలుకు తేడా ఉంది.
రోజా ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావిస్తున్నారు. సభనుంచి సభ్యులను ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశం లేదని, ఆ అధికారం స్పీకరుకు ఉండదనేది ఆమె ఒక వాదన. అలాగే తనను సస్పెండ్ చేసిన తర్వాత.. రెండు నెలలు గడుస్తున్నా సస్పెన్షన్ కాపీ తనకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
అయితే సభాముఖంగానే.. ఆమె సభలో ఉన్న సమయంలోనే స్పీకరు ప్రకటన చేసినందున మళ్లీ నోటీసులు పంపవలసిన అవసరం లేదనేది శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్న మాట. నోటీసులు పంపడం అవసరం లేకపోవచ్చు.. కానీ సస్పెన్షన్ ఉత్తర్వు కాపీని ఆ సభ్యులు అడిగినప్పుడు ఇవ్వడంలో జాప్యం చేయడం ఎలా సబబు? అనే మీమాంస ఇక్కడ ఏర్పడుతుంది.
స్పీకరు అధికారాలకు, సస్పెన్షన్కు సంబంధించి చెబుతున్న రూల్స్ విషయంలో కూడా సంక్లిష్టత ఉన్న నేపథ్యంలో.. చిట్టచివరికి రోజా ప్రయత్నం తుస్సుమంటుందేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. స్పీకరు విధుల్లో తాము జోక్యం చేసుకోలేం అనే మాటతోనే తీర్పు ముగియవచ్చునని కూడా పలువురు అనుమానిస్తున్నారు.