ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. దాదాపుగా ముప్పావుగంట సేపు సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా భౌతిక దూరం పాటిస్తూ.. ముఖం మొత్తం కప్పేసే మాస్కులతో ఉన్న జగన్, విజయసాయిరెడ్డిలు మోడీతో ఫోటో దిగారు. అంత వరకూ బాగానే ఉన్నా అసలు సమావేశంలో ఏ అంశాలు చర్చించారన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అధికారిక ప్రకటన అయితే.. ఖచ్చితంగా సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం తరపున సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటన చేస్తుంది.
ఒక వేళ అదీ లేకపోతే.. ఢిల్లీలో ప్రధానితో భేటీ ముగిసిన వెంటనే… ఆయన పీఆర్ టీం.. మోడీకి జగన్ ఇచ్చిన విజ్ఞాపన లేఖ అంటూ… ఓ ప్రెస్‌నోట్ అయినా ఇచ్చేవారు. ఈ సారి అదీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి.. తనతో పాటు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలను తీసుకుని ప్రధానితో భేటీకి వెళ్లారు. అజెండా ఏమిటో స్పష్టత లేదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా… ప్రధానిని ప్రత్యేకహోదా దగ్గర్నుంచి ఏపీకి రావాల్సిన నిధుల వరకూ అన్నింటినీ అడిగారని … ఢిల్లీ దద్దరిల్లిపోయేలా గర్జించి వచ్చారని పతాక శీర్షికల్లో ప్రచురిస్తుంది.
కానీ ప్రస్తుతం ప్రధానితో భేటీ విషయంలో సాక్షి మీడియా కూడా పెద్దగా హడావుడి చేయలేదు. కారణం ఏమిటో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ఇలా ఉండటం వల్లనే… జగన్ రాష్ట్రం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలు.. కేసులమాఫీ కోసం ప్రధాని వద్దకు వెళ్లారన్న విమర్శలను టీడీపీవర్గాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా వైసీపీ కానీ ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు.