సీఎం జగన్ రెండు రోజుల వరద బాధిత ప్రాంతాల పర్యటన ముగిసింది. విపక్షంలో ఉన్నప్పుడు రెండు రోజుల దీక్తలు చేసేవారు.. ఎలా అంటే ఒక రోజు మధ్యాహ్నం ప్రారంభించి.. మరో రోజు పన్నెండు గంటలకల్లా ముగించేవారు. దానికి రెండు రోజుల దీక్ష అని పేరు పెట్టుకునేవారు. తాజాగా గోదావరి వరద ప్రాంతాల్లో కూడా అలాంటి రెండు రోజుల పర్యటన చేశారు. రెండు రోజుల్లో బాధితులకు ఊరటగా ఆయన చేసిన ప్రకటన ఒక్కటైనా ఉందా అని వెదికితే …ప్చ్ అనుకోక తప్పదు. ఎవరికైనా పైసా ప్రకటించారా అంటే అదీ లేదు. కానీ నిరాశజనకమైన మాటలు చెప్పి.. తన చేతుల్లో ఏమీ లేదని వివరించడానికి మాత్రం ఆయన మొహమాట పడలేదు.
బాధితులకు ఒక్క రూపాయి సాయం ప్రకటించని జగన్ !
వరద బాధితుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ మోహరించిన అక్కడి బాధితుల కన్నీరు తుడవలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి తనను తాను పొగుడుకున్నారు. ప్రతి ఒక్కరూ సాయం అందిందని చెప్పారని ప్రకటించుకున్నారు. తనను పశువులు కూడా అభినందిస్తాయని తేల్చేసుకున్నారు. ఈ మాటల ప్రకారంచూస్తే ఆయన ఎవరికీ సాయం ప్రకటించే ఉద్దేశంలో రాలేదని.. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని వచ్చే విమర్శలను కవర్ చేసుకోవడానికి వచ్చారని స్పష్టమవుతుంది.
సర్వం కోల్పోయిన వారు రూ. రెండు వేల సాయంతో ఆనందపడతారా ?
అన్ని తిరిగి ఒక్క రూపాయి కూడా సాయం ప్రకటించని ముఖ్యమంత్రి జగనే అనుకోవచ్చు. సాధారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి .. పంటలు కోల్పోయినవారికి సర్వం ఆస్తులు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తుంది. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి ఇచ్చే రూ. రెండు వేలు.. నాలుగు ఉల్లిగడ్డలు, టమాటల సాయంతోనే అందరూ సంతోషంగా ఉన్నారని జగన్ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. జగన్ తీరు ప్రజల్ని విస్మయ పరిచింది. నిజానికి సెలక్ట్ చేసిన వారికి తప్ప.. ఇతరులకు జగన్ను కలిసే చాన్సే ఇవ్వలేదు. అంతా ఆర్గనైడ్జ్గా నిర్వహించారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం తన వల్ల కాదని చెప్పి వచ్చిన జగన్ !
పోనీ పోలవరం నిర్వాసితులకు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనైనా నెరవేరుస్తారా అంటే అదీ లేదు. మూడేళ్ల తర్వాత కూడా మాట తప్పను అనే డైలాగులే చెప్పారు.అదే సమయంలో తన చేతిలో ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చారు. తన దగ్గర నిధుల్లేవని కేంద్రం ఇవ్వాల్సిందేనన్నారు. కేంద్రం ఇవ్వనంటోందని తెలిసి కూడా జగన్ ఈ కబుర్లు చెప్పారు. పునరావాసం బాధ్యత రాష్ట్రానిదేనని కేంద్రం చెబుతోంది. దీన్ని జగన్ దాచి పెట్టారు. పోలవరం బాధితుల్ని నిండా ముంచారు. అధికారం చేతిలో ఉండి.. ప్రతిపక్షంలో తాను చెప్పిన పనులు కూడా చేయకుండా మాటలు చెప్పిన జగన్.. గోదావరి వరద బాధితుల్లో పలుచన అయ్యారు.