జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఆత్మగౌరవం గురించి హైపిచ్‌లో ప్రసంగాలు ఇస్తారు. కానీ తన ఆత్మగౌరవాన్ని మాత్రం… ఎప్పటికప్పడు కించ పరచుకోవడానికి ఏ మాత్రం సందేహించరు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి.. తెలంగాణ విభజన కారణంగా పదకొండు రోజులు అన్న మానేశానని చెప్పుకుంటారు. తెలంగాణకు వెళ్లి… తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ముఖ్యమంటారు. ఇప్పుడు.. తమిళనాడుకు వెళ్లి.. ఏపీ, తెలంగాణల్లో అంతా చెత్తగా ఉందని.. తమిళనాడులో గొప్పగా ఉందని… నిర్మోహమాటంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. సొంత రాష్ట్రాలను పరాయి ప్రాంతాల్లో కించ పరచకూడదన్న కనీస ఆత్మగౌరవ సిద్ధాంతాన్ని కూడా.. పక్కన పెట్టేశారు.
తెలుగు మీడియాకు ఎప్పుడైనా ఇంటర్యూలు ఇచ్చావా పవన్..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరో ఆదేశించినట్లు.. ఉన్న పళంగా.. తూర్పుగోదావరి జిల్లాలో పోరాటయాత్ర ఆపేసి.. రెండు రోజుల చెన్నై టూర్ పెట్టుకున్నారు. అక్కడ ఏం చేశారు.. ఎవర్నీ కలిశారన్న విషయం పక్కన పెడితే.. అక్కడ ఆయన చేసిన పని… కొన్ని మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇవ్వడం. తన చెన్నై పర్యటనలో ప్రత్యేకంగా ఓ స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి .. వారికి విందు భోజనాలు పెట్టించి.. అడిగిన వారందరికీ.. ఇంటర్యూలు ఇచ్చారు. కానీ తెలుగులో ఎప్పుడైనా.. ఏ టీవీ చానల్ కు అయినా.. ఏ వెబ్ చానల్‌కు అయినా.. ఏ వెబ్‌సైట్‌కి అయినా.. పవన్ కల్యాణ్ ఇంటర్యూ ఇచ్చారా..?. జాతీయ మీడియాను పిలిపించుకుని మాట్లాడతారు కానీ.. తెలుగు మీడియాకు ఇంత వరకూ ఇంటర్యూ ఇచ్చిన పాపాన పోలేదు. ప్రెస్ మీట్లలో మాట్లాడటం.. సినిమాల కోసమైతే… రికార్డెడ్… ఫుటేజీ పంపడం. తెలుగు మీడియా మీద అంత కలసి ఎందుకు..? పొరుగింటి తమిళ కూర.. అంత రుచిగా ఎందుకు అనిపిస్తోంది..?
బీజేపీ విషయంలో అంత హిపోక్రసీ ఎందుకు..?
తమిళనాడు పర్యటనకు ఏ ఉద్దేశంతో వెళ్లారో కానీ.. తమిళ మీడియాలకు పిలిచి మరీ ఇచ్చిన ఇంటర్యూల్లో.. బీజేపీ అంటే.. అసహ్యం అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు. అక్కడి యువతలో బీజేపీపై ఉన్న కసిని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. అక్కడి యువతలోనే బీజేపీపై వ్యతిరేకత ఉందా..? ఏపీలో లేదా..? ప్రత్యేకహోదా దగ్గర్నుంచి ప్రతి విభజన హామీల విషయంలో అడ్డగోలుగా మోసం చేస్తున్నా… ఏపీలో బీజేపీ ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదు. పైగా.. ముస్లింలకే.. బీజేపీ మతతత్వ పార్టీ కాదని.. పాఠాలు చెప్పడం ఎందుకు..? . ఇప్పుడు మళ్లీ తమిళనాడు వెళ్లి బీజేపీపై చాలా కోపం ఉందని.. చెప్పుకోవడం..ఎందుకు..?. పార్టీని విలీనం చేయమన్నారని చెప్పుకుని… చేయలేదని.. తను ఎప్పటికీ బీజేపీతో కలవనన్నట్లుగా ప్రకటించుకోవడం ఎందుకు..?
సూపర్ స్టార్లతో కలిసి పని చేసే స్థాయి వచ్చిందా..?
పవన్ ఇంటర్యూల్లో చెప్పిన ఎజెండా ప్రకారం.. చూస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కమల్ హాసన్‌తో భేటీ కోసమే ఆయన ప్రత్యేకంగా వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళనాడులో.. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో భవిష్యత్‌లో కలసి పని చేస్తానని తనంతటకు తానుగా చెప్పుకున్నారు. దక్షిణాదిలో కీలక పాత్ర పోషిస్తానన్నట్లుగా జబ్బలు చరుచుకున్నారు. కానీ .. ఐదేళ్ల పార్టీ ప్రస్థానంలో ఒక్క ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొనలేని… అసమర్థతతో… కనీసం.. రెండు జిల్లాలకు మించి తన రాజకీయ ప్రాబల్యాన్ని గుర్తించలేని దుస్థితిలో పడిపోయిన సమయంలో.. మొత్తం దక్షిణాది గురించి.. సూపర్ స్టార్లతో కలసి పని చేయడం గురించి చెప్పుకోవడం అవసరమా..? కమల్ హాసన్.. పార్టీ అనుకున్నారు. పెట్టారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ రేంజ్ వేరు., వాళ్లతో కలిసి పని చేసే స్థాయి జనసేకు వస్తుందా..? వచ్చేలా పని చేస్తున్నారా..?
చెన్నైలో ఏం చేశావో చెప్పుకోగలవా..?
ఎవరో బలవంతంగా పంపినట్లు రెండు రోజుల చెన్నై పర్యటనకు వెళ్లి.. వెళ్లే ముందు కమల్‌హాసన్‌తో కలుస్తా… అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులను కలుస్తానని హడావుడి చేయడమే కానీ.. ఎవర్ని కలిశావో చెప్పుకునేంత సరుకు ఆ టూర్లో ఉందా…? ఎవరెవరి అపాయింట్లు అడిగారో.. ఎవరెవరు ఇచ్చారో.. ఎవరెవరు ఇవ్వలేదో.. బయటపెట్టే దైర్యం ఉందా..? ఎవర్నీ కలవకుండా.. కొంత మంది కులపోళ్లను పోగు చేసి… ఫ్యాన్స్ మీటింగ్‌తో హడావుడి చేసి.. తిరిగి వచ్చేస్తే.. అది దక్షిణాదిలో చక్రం తిప్పే రాజకీయ నేత యాత్ర అవుతుందా..?. ముందుగా పవన్ కల్యాణ్ తనను తాను నిరూపించుకుంటే.. ఆ తర్వాత పక్క రాష్ట్రాల రాజకీయాలు చూసుకోవచ్చు.
— సుభాష్