పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో రెండు తెలుగుదేశాలలోని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహం రెండు తెలుగు రాష్ట్రాల అవసరం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో నివేదించవలసిన అంశాలు తదితర విషయాల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎలాంటి మార్గదర్శనం చేయబోతున్నాడో అనీ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నెల ఇరవై మూడోతేదీనుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్న నేపధ్యంలో ఇరవై ఒకటవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం ఎంపీలందరితోనూ చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహించబోతున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిని వైఖరిపై సలహాలు, సూచనలు చెప్పబోతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే ప్రతి సందర్భంలోనూ ఇలాంటి సమావేశం విధిగా జరుగుతుంది. అయితే ఎంత క్రియాశీలమైన నిర్దిష్టమైన కార్యచరణను సూచిస్తారు. పోరాడి అయినా తమకు కావాల్సిన దానిని సాధించుకోవడం గురించి వారికి నూరిపోస్తారా లేదా అనేదే కీలకం.
నిజానికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. మల్లారెడ్డి పేరుకే చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ, అటు పార్లమెంటులో తెలంగాణకు కావలిసిన విషయాల గురించి పెద్దగా ప్రస్తావిస్తున్న సందర్భమేమీ కనిపించడంలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఖ్యాపరంగా ఎక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాల గురించి ప్రధానంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం లేదు. పార్లమెంటు సాక్షిగా చేస్తున్న ప్రయత్నం అంటూ కనిపించడం లేదు. విడివిడిగా మంత్రులను వారి వారి చాంబర్లలో కలిసి తమ రాష్ట్రాల్లో ఏమికావాలో వినతి పత్రాలు ఇచ్చి వారు ఒప్పుకుంటే సరీ, లేదంటే డీలా పడిన ముఖాలతో తిరిగిరావడం తప్పా పార్లమెంటు సాక్షిగా ఒక విధానం తీసుకుని తమ అవసరాలను డిమాండ్‌గా వినిపించడం అనేది తెలుగుదేశం ఎంపీలు ఈ ఎడాదిన్నర కాలంగా నూ చేయలేకపోతున్నారనేది సత్యం. అందువల్లనే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి కేంద్రం అప్పుడప్పుడు ఎంతో కొంత నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రానికి న్యాయంగా, ధర్మండి దక్కవలసినంత వనరులు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబునాయుడు తాజాగా బడ్జెట్ సమావేశాలముందు పార్టీ ఎంపీలతో సమావేశం కాబోతుండటం గమనార్హం. కనీసం ఈ సమావేశంలోనైనా స్పష్టమైన కార్యాచరణతో కేంద్రంతో ఏదైనా సాధించడాన్ని నూరిపోస్తారా, లేదా కేంద్రం పెట్టే బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం తప్పా పార్లమెంటులో చేసేదేమీలేనట్లుగా వారిని తీర్చిదిద్ది పంపుతారా అనేది వేచి చూడాల్సిఉంది.