పొత్తులపై పవన్ కల్యాణ్ రణస్థలం వేదికగా యువశక్తి సభలో ఓ క్లారిటీ ఇచ్చారు. “సరైన గౌరవం” లభిస్తే కలిసి పోరాడటానికి సిద్ధమమన్నారు. సరైన గౌరవం అంటే ఏమిటి .. పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి ఏం ఆశిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. పొత్తులు అంటే రెండు పార్టీల మధ్య ప్రధానంగా వచ్చేది సీట్ల పంపకంలో తేడాలు. ఓ పార్టీ అత్యధిక సీట్లు కోరుకుంటుంది. మరో పార్టీ మాత్రం తామే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని అనుకుంటుంది. అది సహజం. పవన్ కల్యాణ్ తన పార్టీ బలానికి తగ్గట్లుగా ఎన్ని సీట్లు ఇస్తే గౌరవంగా ఫీలవుతారనేది ఇప్పటి వరకూ అంచనాలకు రాలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటయితే.. అప్పుడు ఎలాంటి గౌరవాన్ని కోరుకుంటారనేది మరో కీలకమైన అంశం.
అయితే రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను అంతర్గతంగా చర్చించుకుని పొత్తులపై ఓ నిర్ణయానికి వస్తాయి. తెలుగుదేశం పార్టీ .. పవన్ ఏ స్థాయి గౌరవం ఇవ్వాలనుకుంటోంది.. పవన్ ఏ స్థాయి గౌరవం కోరుకుంటున్నారన్న దానిపై ఏపీలో పొత్తు పొడుపు ఉంటుందని అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ గౌరవానికి టీడీపీ గతంలో ఏెప్పుడూ లోటు రానీయలేదు. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి 2014లో మద్దతు ఇచ్చారు. నాలుగేళ్లు ఆయన టీడీపీ ప్రభుత్వంతో సన్నిహితంగానే ఉన్నారు. తన వద్దకు సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఆయన ప్రభుత్వం ద్వారా భరోసా కల్పించేవారు. పవన్ కల్యాణ్ మాటలకు అప్పటి ప్రభుత్వం కూడా విలువ ఇచ్చేది. పరిష్కారాలు చూపించేది. అయితే ఎన్నికలున్న చివరి ఏడాది మాత్రం పవన్ కల్యాణ్ రూటు మార్చారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు.
అయితే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీకి అన్వయించారు పవన్. ఆ ఇష్యూలో టీడీపీకి సంబంధం లేదని తర్వాత తేలింది. చంద్రబాబు ఎప్పుడూ పవన్ ను విమర్శించలేదు. పవన్ ను విమర్శించిన వారిని చంద్రబాబు కంట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆయన కూడా వేధింపులు ఎదుర్కోవడంతో.. గతంలోలా ఓట్ల చీలిక కోసం కాకుండా.. ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నారు. అయితే తనకు తగ్గ గౌరవాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఆ గౌరవం ఏమిటనేది ఇప్పుడు కీలకం.