పదేళ్లు అధికారానికి అలవాటు పడి బీఆర్ఎస్ పోరాట పంథా మరిచిపోయినట్టుంది.. ఏ లీడర్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.. అసలు పార్టీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలియడం లేదు.
ప్రజా సమస్యలను వదిలేసి, పొలిటికల్ అంశాలను ముందేసుకుంటున్నారు. ఇన్ స్టంట్ గా ఏది దొరికితే దాన్నిపట్టుకుని ఇష్యూ చేస్తున్నారు. దేన్నీ కూడా చివరి వరకు కొనసాగించడం లేదు.. ఒకరు రుణమాఫీపై దీక్ష అంటున్నారు. మరొకరు కులగణనపై దీక్ష అంటున్నారు..ఇటు చూస్తే కౌశిక్ రెడ్డి వ్యవహారం..ఇలా ఆ పార్టీ గత రాజకీయాలపై అవగాహనా కల్గిన వారంతా బీఆర్ఎస్ ప్రస్తుత పోకడలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ గతంలో ఓ అంశాన్ని టేకప్ చేసిందంటే.. చివరి వరకు కొట్లాడే పార్టీగా ముద్ర వేసుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు మునుపు రాష్ట్ర సాధనే ధ్యేయంగా సుదీర్ఘ ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకున్న బీఆర్ఎస్ ..ఉద్యమ పార్టీగా పదేళ్లు అధికారాన్ని అనుభవించింది. పవర్ పాలిటిక్స్ మైకం కమ్మేసిందో ఏమో కానీ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ ఓ నిర్దిష్టమైన నిర్ణయానికి కట్టుబడి ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది.
రుణమాఫీ విషయంలో రైతులను కాంగ్రెస్ దోఖా చేసిందని..ఈ విషయమై దీక్షలు చేపడుతామని ప్రకటించగానే..వెంటనే బీసీ కుల గణనపై సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్షలు చేపడుతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ ప్రకటనలు నేతల సొంత నిర్ణయమా? పార్టీ నిర్ణయమా అనేది క్లారిటీ లేకపోయినా.. ఎవరికి వారు బిగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతోనే ఇన్ స్టంట్ నిర్ణయాలతో పార్టీ నేతలు ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇప్పుడు కౌశిక్ రెడ్డి – అరికపూడి గాంధీ వివాదం చెలరేగుతుండటంతో కొత్తగా ఈ అంశాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. సర్కార్ ను ఇరుకున పెట్టే విషయంలో స్పష్టమైన ఎజెండా లేకపోవడం, వెనువెంటనే నిర్ణయాలు మార్చుకోవడం వలన బీఆర్ఎస్ కు ఏమేర లాభం ఉంటుందో కాని, అధికార పార్టీకి మాత్రం లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.