నేను మోనార్క్ అని ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగులు చెబుతారేమో కానీ నిజ జీవితంలో సీఎం జగన్ అలాగే ప్రవర్తిస్తారని వైసీపీలో ఎమ్మెల్యేలకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన తమను బతిమాలుకున్న వైనం చూసి… ఆ ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారు. ఇంత నటన ఎలా సాధ్యమని వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష జరగడానికి ఒక్క రోజు ముందు వరకూ జగన్ … గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేల సంగతి తేల్చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గాన్ని మార్చేస్తున్నారని చెప్పుకున్నారు. కానీ ఒక్క రోజు ముందు సీన్ మారిపోయింది.
సీఎం జగన్ కనీసం యాభై మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్ట్రెయిట్ ఫార్వాడ్ గా ఉన్నారు. తన వెంట ఎంత కాలం నుంచి ఉన్నారు.. పార్టీకి ఎంత విధేయులు అన్నది తాను పట్టించుకోనని.. గెలుపు గుర్రాలు అనుకుంటేనే టిక్కెట్లు ఇస్తానని చెబుతున్నారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజున తనను కలిసిన ఎమ్మెల్యేలతోనూ అదే చెప్పారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్షలో మాత్రం పూర్తిగా రివర్స్‌లో వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యేను.. ఒక్క కార్యకర్తను కూడా వదులుకోనని అందర్నీ గెలిపించుకుంటానని చెప్పారు. దీంతో జగన్‌లో భయం కనిపించిందని కొంత మంది ఎమ్మెల్యేలు సెటైర్లు వేసుకుంటున్నారు.
గతంలో గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష ఎప్పుడు జరిగినా గ్రాఫ్ తగ్గిన వారి పేర్లు నేరుగానే ప్రకటించే వారు. వారిని అక్కడే నిలదీసేవారు. ఈ సారి ఆయన గ్రాఫ్‌లు బయట పెట్టి నేరుగా కించపర్చడం.. నిలదీయడం వంటివి చేయలేదు. పైగా చాలా సాఫ్ట్ గా మాట్లారు. సీఎం జగన్‌లో వచ్చిన ఈ మార్పునకు కారణం ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న ఆందోళన కారణమని భావిస్తున్నారు. గతంలోలా జగన్ ఏది చెబితే అదే రైట్ అనే పరిస్థితి మారడంతో .. పార్టీ అధినేతగా ఆలోచించి ఆయన రియలైజ్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిపితే అది కుంపటి పెట్టుకోవడేనని సీఎం జగన్‌కు గుర్తుకొచ్చింది. అందుకే ఆగిపోయారు.
మొత్తంగా సీఎం జగన్… తాను మోనార్క్ నన్నట్లుగా వ్యవహిరంచడానికి భయపడుతున్నారు. ఎమ్మెల్యేల ముందు కాస్త తగ్గి వ్యవహరించాల్సి వచ్చింది. దీన్ని అసంతృప్త ఎమ్మెల్యేలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటే మాత్రం వైసీపీలో మరో రకమైన రాజకీయాలు ఉంటాయి. అది జగన్ ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే చాన్స్ ఉంది.