తెలుగుదనం నిండిన సినిమాలు తీయడంలో తనదైన మార్క్ వేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా, జెంటిల్మెన్, అమీతుమీ లాంటి సినిమాలు ఆయన్నుంచి వచ్చాయి. ఇప్పుడాయన ‘సారంగపాణి జాతకం’ అనే సినిమా చేశారు. ఈనెల 20న విడుదల అవుతోంది. రౌడీ హీరో విజయ్‌దేవరకొండతో ఇంద్రగంటి ఓ సినిమా చేస్తారని ఇది వరకు ప్రచారం జరిగింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని అనుకొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎంతకీ ముందుకు కదల్లేదు. ఈలోగా విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమాని మొదలెట్టేశారు. దాంతో ఈ కాంబోలో సినిమా ఉండదేమో అనే నిర్ణయానికి వచ్చేసింది టాలీవుడ్. దీనిపై ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు. విజయ్‌దేవరకొండతో సినిమా ఉంటుందని, కాకపోతే.. దానికి కాస్త టైమ్ పడుతుందని స్పష్టం చేశారు. ”విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. విజయ్ కూడా రెడీగానే ఉన్నాడు. రెండు మూడు కథలు అనుకొన్నాం. కానీ సెట్ కాలేదు. ఈసారి తనకోసం మంచి కథ రాయాలి” అన్నారు ఇంద్రగంటి.
ఈరోజుల్లో ఎప్పుడు ఏం కాంబో సెట్ అవుతుందో చెప్పడం కష్టం. ఓ హిట్టు పడితే సమీకరణాలు మారిపోతాయి. ‘సారంగపాణి జాతకం’ హిట్టయితే… హీరోలు ఇంద్రగంటిని చూసే కోణం మారుతుంది. మన హీరోలెప్పుడూ మాస్, వరల్డ్ బిల్డింగ్ లాంటి కథలే చేయాలనుకోరు. మధ్యమధ్యలో సాఫ్ట్ ఫిల్మ్స్‌ని కూడా ఇష్టపడుతుంటారు. అలాంటి సినిమాలు తీయడంలో ఇంద్రగంటి నేర్పరి. మంచి క్లాస్ ఫిల్మ్ కావాలి అనుకొన్న హీరోలకు ఇంద్రగంటిని ఓ ఆప్షన్‌గా చూడొచ్చు. సో… విజయ్ దేవరకొండతో సినిమా విషయంలో ఇంద్రగంటి తలుపులు ఇంకా మూసుకుపోలేదు. కాకపోతే.. కొంత టైమ్ పడుతుంది అంతే.