బయోపిక్స్ లో ‘యాత్ర’ తనదంటూ ప్రత్యేకతని సంతరించుకొంది. మహి.వి.రాఘవ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. వైకాపా ముద్ర ఉన్నప్పటికీ ఈ సినిమాని పార్టీలకు అతీతంగా ఆదరించారు. ఎక్కడా కంట్రవర్సీలకు చోటివ్వకుండా ఈ కథని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంది. ‘యాత్ర’లో జగన్ ప్రస్తావన లేదు.కథంతా వైఎస్ఆర్ చుట్టూనే తిరిగింది. `యాత్ర` హిట్టవ్వడంతో పార్ట్ 2పై అందరి దృష్టీ పడింది. అందులో జగన్ కనిపిస్తారని, వై.ఎస్ మరణం తరవాతి నుంచి జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఈ కథ సాగుతుందని ప్రచారం జరిగింది. నిజంగా మంచి ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అది. తీస్తే… జగన్ కి ప్లస్ అయ్యేది. కానీ.. ‘యాత్ర 2’ అత్తా పత్తా లేకుండా పోయింది.
ఇప్పుడు రాంగోపాల్ వర్మని రంగంలోకి దించి…. వ్యూహం, శపథం అనే రెండు సినిమాల్ని ఏక బిగిన తీసేసే ప్లాన్ చేస్తోంది వైకాపా. ఫామ్ లో లేని వర్మని ఎవరు నమ్మారో, ఎందుకు నమ్మాల్సివచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వర్మని నమ్మే బదులు `యాత్ర 2`ని పట్టాలెక్కిస్తే.. మైలేజీ బాగుండేదేమో అనిపిస్తోంది. కాకపోతే.. మహి. వి.రాఘవ స్టైల్ వేరు. తను నమ్మిందే తీస్తాడు. కానీ వర్మ అలా కాదు. తనకు అనుకూలమైన వర్గం కోసం సినిమాలు తీస్తాడు. వైకాపాకి కావల్సింది అదే. పైగా కాంట్రవర్సీలు చేసినా కూడా గుడ్డిగా ఇష్టం వచ్చింది మాట్లాడేయగలడు వర్మ. మాటలతోనే మభ్యపెట్టగలడు. తనపై ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శణాబాణాలు ఎక్కుపెట్టినా ఓర్చుకోగలడు. తిప్పి కొట్టగలడు. అందుకే.. `యాత్ర 2` కంటే… వర్మతో సినిమాలు తీయించడమే బెటర్ అనుకొన్నారేమో..?