ఏపీకి చెందిన ఆ గ్రామ ప్రజలు రాత్రి అయిందంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం లేవగానే ఏ దారుణం చూడాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు. గ్రామంలో పలు చోట్ల తలుపులకు, చెట్లకు నిమ్మకాయలు, రోడ్ల వెంట డబ్బులు, అన్నం.. ఉదయం లేవగానే గ్రామస్తులకు కనిపిస్తోన్న భయానక దృశ్యాలు ఇవి.
పల్నాడు జిల్లా చిన్నతురకపాలెంలో వరుసగా ఇదే సీన్ కొనసాగుతుండటంతో గ్రామంలో అసలేం జరుగుతుందని జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నతురకపాలెంలో రెండు వారాల కిందట ఓ వ్యక్తి ఇంటి గోడకు మేకులు కొట్టి కనిపించాయి. ఆ మరుసటి రోజే చెట్టుకు మేకులు కనిపించాయి. మొదట్లో వీటిని చూసి చూడనట్టు వదిలేసిన గ్రామస్తులు.. తర్వాత రోజు నుంచి గ్రామంలో పలు చోట్ల ఇదే తంతు కనిపిస్తుండటంతో ఊరికి ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారనే అంచనాకు వచ్చారు.
సాధారణ వేళలో క్షుద్ర పూజలు ఆనవాలు కనిపించకపోయినా ఉదయం లేవగానే క్షుద్ర పూజల ఆనవాలు కనిపిస్తుండటంతో ఎవరో చేతబడి చేస్తున్నారని జనాలకు భయం పట్టుకుంది. ఊరిలో రోజూ ఎందుకు ఇలా చేస్తున్నారు..? ఎవరు ఈ పనికి ఒడిగడుతున్నారు..? అనేది తెలియక జనాల్లో ఓ రకమైన ఆందోళన మొదలైంది.
రాత్రి అయిదంటే చాలు ఉదయం ఎదో అయిపోతుందన్న టెన్షన్ తో గ్రామస్తులు నిద్రకు కూడా ఉపక్రమించడం లేదు. తమ కళ్ళు గప్పి ఏదైనా చేస్తున్నారేమోనని ఉదయం గోడలను చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి వేళలో తమ ఎరియాలోకి ఎవరూ రాకుండా ఉండేలా ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, గత రెండు వారాలుగా ఈ క్షుద్రపూజల వాతావరణం కనిపిస్తున్నా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.