ఈసారి రైల్వే బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు రెండూ చాలా ఆశలు పెట్టుకున్నాయి. అయితే మొత్తం పది కోట్ల మంది ప్రజలను దారుణంగా వంచిస్తూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. ఏదో నాంకేవాస్తే ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్లే రైల్వే వ్యవహారాల్లో పొరబాటుగా తెలుగు ప్రాంతాల పేర్లు కూడా ప్రస్తావనకు రావడం తప్ప.. రైల్వేబడ్జెట్ తెలుగు ప్రాంతానికి ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఇద్దరూ సమానంగా మోసపోయారు. కేంద్రంలో భాగస్వామి పార్టీగా ఉంటూ వారి మిత్రపక్షం అయినందుకు అటు ఏపీ లోని తెలుగుదేశం సాధించిందీ వీసమెత్తు లేదు. ఇటు కొత్తగా కేంద్రంలోని భాజపాతో మెతకవైఖరి ప్రారంభించి.. అంశాలవారీ మద్దతు ఇస్తాం అంటూ వారితో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు సాధించిందీ ఏమీ లేదు. ఆదాయమూ ఖర్చులూ బ్యాలెన్స్ షీట్గానూ, అభివృద్ధి ముసుగులో ప్రైవేటు రంగానికి దోచిపెట్టే దిశగా వేసే అడుగుల నివేదికతోనూ, అంతోఇంతో ప్రయాణికుల వసతుల గురించి ప్రస్తావిస్తూ సురేశ్ ప్రభు బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
1.87 లక్షల కోట్ల ఆదాయం మీద కన్నేసిన సురేష్‌ప్రభు ప్రణాళిక అంచనా వ్యయం 1.21 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. పీపీపీ కొత్త ప్రాజెక్టులు అనేకం రాబోతున్నట్లు వెల్లడించారు. కొత్త ఆదాయ వనరుల మీద దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు వసతుల కల్పన పరంగా కొన్ని కొత్త ఆలోచనలు ఈ బడ్జెట్లో ఉండడాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని సగటున గంటకు 50 నుంచి 80 కిలోమీటర్లకు పెంచాలనే నిర్ణయాల్ని కూడా అభినందించాల్సిందే. అయితే కొత్తగా ఏర్పడిన రెండు తెలుగురాష్ట్రాలను మాత్రం దారుణంగా నిరాశపరచడం విమర్శలకు గురవుతోంది.
అయితే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి గానీ, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను గురించి గానీ.. ఎలాంటి కొత్త ప్రాజెక్టుల గురించి కూడా సురేశ్‌ప్రభు కనీసం ప్రస్తావించలేదు.
ఏపీ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి విశాఖ రైల్వే జోన్ గురించిన మాట మాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం చాలా దారుణం అని జనం భావిస్తున్నారు.