నటి జయప్రద ఆంధ్రా రాజకీయాలపై దృష్టిపెట్టారనీ, ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనసేన వైపు కూడా ఆమె చూస్తున్నారని మరికొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. వైకాపా నుంచి రాజమండ్రి ఎంపీ సీటు దక్కించుకుని, టీడీపీ ఎంపీ మురళీమోహన్ మీద పోటీకి దిగాలని ఆమె భావిస్తున్నారట! రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో వైకాపా నుంచి సానుకూల సంకేతాలు వస్తాయనే ఆశాభావంతో ఆమె ఉన్నారట.
జయప్రద చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసి చాన్నాళ్లయింది. రాజకీయంగా చూసుకుంటే… టీడీపీ నుంచే ఆమె ఓసారి రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఆ తరువాత, యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో చేరి, అమర్ సింగ్ ప్రోత్సాహంతో రాజ్యసభ ఎంపీగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభ సమయంలో జయప్రద అక్కడి రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఇప్పుడు, ఆంధ్రా రాజకీయాలవైపు ఆమె చూస్తున్నారంటే… ఇక్కడి పార్టీలు ఏవైనా ముందుగా ఏం ఆలోచిస్తాయి..? ఆమె సినీ గ్లామర్ ఇక్కడ పనికొస్తుందా, ఆమె పొలిటికల్ కెరీర్ లోని విజయాలు అక్కరకు వస్తాయా అనే కదా ఆలోచిస్తారు..?
రాజమండ్రి ఎంపీ స్థానం విషయానికొస్తే… 2009లో ప్రజారాజ్యం తరఫున కృష్ణం రాజు పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. మురళీమోహన్ అక్కడ ఎంపీగా కొనసాగుతున్నా… అది కేవలం సినీ గ్లామర్ తోనే వస్తున్న ఆదరణ కాదు కదా. అయినా, సినీ గ్లామర్ అనేది… ప్రస్తుతం సినిమాల్లో ఉంటూ, లేదా సినిమాలకు దూరంగా ఉంటున్నా జనాల్లో బాగా క్రేజ్ ఉన్నవారికి వర్తిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఆలోచించాకే ఎవర్నైనా చేర్చుకుంటుంది. అయితే, వస్తామన్న మాజీ తారలను ఏ పార్టీలూ వద్దనుకోవు. కనీసం ప్రచారంలో భాగంగా వారి సేవలు వినియోగించుకోవచ్చు. అంతేగానీ… వారికి కీలకమైన ఎంపీ స్థానాలు ఇవ్వాలనుకుంటే… అప్పటి లెక్కలు వేరేలా ఉంటాయి. ఇప్పుడు జయప్రద చేరికపై వస్తున్న కథనాలు ఏకంగా రాజమండ్రి ఎంపీ సీటు ఆమెకి ఇచ్చేస్తారనే స్థాయిలో ఉంటున్నాయి. టీడీపీకి అత్యంత బలమైన రాజమండ్రి విషయంలో వైకాపా కూడా అంత ఈజీగా అభ్యర్థికి సంబంధించిన నిర్ణయం తీసుకోదు కదా!