ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లతో గెలిచిన వారికే సర్వాధికారాలు ఉంటాయని .. తాము ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి లాంటి నయా నేతలు ఉన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాంగం పట్ల కనీస అవగాహన ఉన్న వారు.. ఎవరూ ఈసీకి ఆ అధికారం ఉందా.. అన్న ప్రశ్న వేయలేదు. ఈసీ తీసుకున్న చర్యలు తప్పు అనిపిస్తే న్యాయపోరాటాలు చేసేరేమో కానీ.. ఆ అధికారాలు లేవు అని మాత్రం.. ఎవరూ అనలేదు. ఎందుకంటే… రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అత్యంత కీలకమైనది ఎన్నికల సంఘం.
175 సీట్లు వచ్చినా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సర్కార్ కన్నా ఈసీనే సుప్రీం..!
దేశ స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటాయి. దేశ స్థాయిలో.. లోక్‌సభ, అసెంబ్లీ, మండలి, రాజ్యసభ వంటి ఎన్నికలను ఢిల్లీ ఈసీ నిర్వహిస్తే.. రాష్ట్ర స్థాయిలో స్థానిక ఎన్నికల్లో ఎస్ఈసీ నిర్వహిస్తుంది. వీటి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఇవి ప్రభుత్వానికి బాధ్యులు కావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే తాము అధికారంలో ఉన్నామని.. అధికారం చెల్లాంచాల్సింది తామా.. రమేశ్ కుమారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కులం పేరు పెట్టి మరీ విమర్శలు చేసిన జగన్.. ఎస్ఈసీని ఏకవచనంతో సంబోధిస్తూ.. ఎన్నికల్ని వాయిదా వేయడానికి… అధికారుల్ని బదిలీ చేయడానికి.. పథకాలు నిలిపివేయమని చెప్పడానికి రమేష్ కుమార్ ఎవరని ప్రశ్నించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏమిటంటే.. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసీనే సుప్రీం. ఏం చెబితే అది చేయాలి. ఆ విషయంలో .. పదో తరగతి పిల్లలకు కూడా క్లారిటీ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రికి మాత్రం లేదు. ఆయన అధికారాలను ప్రశ్నించడం అంటే.. రాజ్యాంగాన్ని ప్రశ్నించడమే అవుతుంది.
రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉంటే ఇలా మాట్లాడరు..!
అయితే.. జగన్మోహన్ రెడ్డి తనకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి.. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి.. తనకే ఎక్కువ అధికారాలు ఉంటాయని .. రాజ్యాంగం తెలియనట్లుగా మాట్లాడటం.. చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతానికి గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. తర్వాత పై స్థాయిలో రమేష్ కుమార్ పనితీరును చర్చకు పెడతామని జగన్ ప్రకటించుకున్నారు. జగన్ తీరును చాలా మంది తప్పు పడుతున్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు… ముఖ్యమంత్రి ఈసీ అధికారాల గురించి తెలుసుకోవాలని ట్వీట్ చేశారు. ఇంకా పలువురు ప్రముఖులు.. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ పరిజ్ఞానం బొత్తిగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బోలెడంత మంది సలహాదారులున్నారు. ఈసీపై ప్రభుత్వ పాత్రలో ఉండి మరీ దండయాత్ర చేయమని ఎవరు సలహా ఇచ్చారో కానీ.. ఆ దండయాత్రను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని ఆయన చెప్పుకుంటున్నారు.
ఈసీ అధికారాలపై చర్చ పెడితే పోయేది పరువే..!
కేంద్రం దృష్టికి.. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని కూడా ప్రకటించేశారు. ఇప్పటికే.. ఎస్ఈసీ తీరుపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దానిపై హైకోర్టు ఎస్ఈసీ తీరుపై విమర్శలు గుప్పించింది కూడా. ప్రభుత్వ ఒత్తిడికి లోబడే.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తూండటంతో.. ఎస్ఈసీ స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ అది ప్రభుత్వానికి నచ్చడం లేదు. అధికారాలనే ప్రశ్నిస్తున్నారు. ఎస్ఈసీ అధికారాలను ప్రశ్నిస్తే..ఎంత పోరాటం చేస్తే..అంతగా పరువు పోయేది.. జగన్ అండ్ కో టీమ్ దే.