కర్ణాటక రాజకీయాలు… ఎన్నికల ఫలితాలు వెల్లడయినప్పటి నుంచి అనిశ్చితిగానే ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీ.. ఎప్పటికప్పుడు.. ఆపరేషన్ కమల అమలు చేస్తోందని… చెబుతూ వస్తున్నారు. కానీ.. అది అంతగా సక్సెస్ కావడం లేదు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే చేశారు. ఇద్దరు స్వతంత్రులు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమికి మద్దతు ఉపసంహరించారు. మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ గూటికి చేరినట్లు చెబుతున్నారు. ఇలా చేయడం వెనుక బీజేపీ సాధించాలనుకున్న లక్ష్యం ఏమిటి..?
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి కర్ణాటక ప్రభుత్వాన్ని పడగొడుతున్నారా..?
భారతీయ జనతా పార్టీకి.. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలనే తపన ఉండకపోవచ్చు. కానీ… ఆ పార్టీకి కొన్ని జాతీయలక్ష్యాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రెండో సారి అధికారంలోకి రావాలని.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ క్రమంలో ఇటీవలి కాలంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. కాంగ్రెస్‌తో బీజేపీ ముఖాముఖి తలపడే… రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయాల కారణంగా .. దేశ ప్రజల్లో.. కాంగ్రెస్ పట్ల ఓ సానుకూల భావన ఉంది. ఈ సానుకూల భావన .. పెరగకుండా.. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడితే.. ప్రజల్లో.. కాంగ్రెస్ పట్ల అంత సానుకూలత లేదన్న అభిప్రాయాన్ని తీసుకు రావాలన్న ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా.. అన్నది కూడా కాంగ్రెస్ సాధించే సీట్లపైనే ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ 130 సీట్ల వరకూ గెలుచుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ… ఆ పార్టీ వైపు వెళ్తాయి. అంత కంటే.. తక్కువ గెల్చుకుంటే.. బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధపడతాయి. అందుకే… కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేది… భారతీయ జనతా పార్టీ మొదటి లక్ష్యం.
కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుపుకోదని చెప్పాలనుకుంటున్నారా..?
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రులతో కలసి పని చేస్తోంది. సొంతంగా అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి.. మిత్రులతో కలిసి సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. మరికొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చేసుకోకపోయినప్పటికీ… మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. అందుకే… భారతీయ జనతా పార్టీ… కాంగ్రెస్‌కు… మిత్రపక్షాలతో కలిసే అలవాటు లేదని.. వారు సంకీర్ణ ప్రభుత్వాలను నడపలేరని చెప్పడానికి… సంకేతాలు పంపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే… ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. కర్ణాటకలో జేడీఎస్‌కు అధికారం ఇచ్చిన కాంగ్రెస్.. ఎక్కువ కాలం.. అలా భరించలేదని… మిత్రపక్షాలను సతాయిస్తుందని… విలువ ఇవ్వదని చెప్పేందుకు… కర్ణాటక సంక్షోభాన్ని సృష్టిస్తుందని .. భారత దేశ ప్రజలకు.. రాజకీయ వ్యవస్థకు సంకేతం పంపుతోందని భావించవచ్చు. అంటే… 2019లో కూటమి రాజకీయాల్ని చెదగకొట్టాలనేది.. కర్ణాటక నుంచి బీజేపీ నుంచి ప్రయత్నం.
దక్షిణాదిలో బీజేపీ సీట్లు పెంచుకునే లక్ష్యంతో రాజకీయ సంక్షోభమా..?
ఇది మాత్రమే కాదు.. భారతీయ జనతా పార్టీకి.. కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఈ సారి కాంగ్రెస్ – జేడీఎస్ కలసి పోటీ చేస్తే… ఎన్నికల లెక్కల ప్రకారం.. 12 సీట్లు గల్లంతవుతాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలసి పోటీ చేయడం వల్ల మెజార్టీ సీట్లు కోల్పోతారని స్పష్టమవుతోంది. అలాగే ఇటీవల ఓడిపోయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్‌లలో… సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గుజరాత్‌లోనూ పరిస్థితి అంత సానుకూలంగా లేదు. అంటే.. గత ఎన్నికల్లో 95 శాతం లోక్ సభ సీట్లు సాధించిన రాష్ట్రాల్లో బీజేపీ కి సీట్లు తగ్గబోతున్నాయి. ఇలా తగ్గే సీట్లను.. దక్షిణాదిలో పెంచుకోవాలనుకుంటోంది. కానీ దక్షిణాదిలో.. ఆ పార్టీకి బలం ఉన్న కర్ణాటకలో మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఒక్క సీటు అయినా వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కర్ణాటకలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. ఈ లక్ష్యం సాధించాలంటే.. కాంగ్రెస్ – జేడీఎస్ కలసి పోటీ చేయకూడదు. ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి కలసి పోటీ చేస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వాన్ని పడగొట్టకపోయినా .. కలసి పోటీ చేయకుండా ఉంటే బీజేపీకి చాలు. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికే .. బీజేపీ.. ఈ సంక్షోభాలను సృష్టిస్తోంది.
ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బకొట్టే లక్ష్యమా..?
ప్రతిపక్షాల ఐక్యతను.. కర్ణాటక వేదికగా గండికొట్టి.. వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ రాజకీయాలకు తావు లేదని చెప్పడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కేవలం యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికే.. ప్రస్తుతం కర్ణాటక పరిణామాలు జరగడం లేదు. కర్ణాటకను చూపించి దేశ రాజకీయాల్లో మార్పులు తేవాలనే లక్ష్యంతోనే.. బీజేపీ ఇప్పుడు.. కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.