నిర్మాతగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం దిల్ రాజుది. ఇప్పుడు ఆ అనుభవాన్ని.. ఈ తరం నిర్మాతలకు పంచాలని ఫిక్సయ్యారు. అందులో భాగంగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే సంస్థని స్థాపించారు. కొత్తగా చిత్రరంగంలోకి అడడుగు పెడుతున్న వాళ్లందరికీ ఈ సంస్థ ఓ వారధిలా, వేదికలా ఉండబోతోంది. ఈ సంస్థ ద్వారా యేడాదికి 5 చిత్రాలు నిర్మించాలన్నది దిల్ రాజు ఆలోచన. సినిమా రంగంపై ఆసక్తి ఉండి, పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు దిల్ రాజు డ్రీమ్స్ మార్గ దర్శనం చేయబోతోంది. అందుకోసం ఓ టీమ్ ని ఏర్పాటు చేశారు దిల్ రాజు. ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఈనెలలో గానీ, జనవరి 1న గానీ ఈ వెబ్ సైట్ ని ఆవిష్కరించబోతున్నారు.
చాలామంది నిర్మాతలు డబ్బుండి కూడా సరైన గైడెన్స్ లేక, పరాజయాలు పొందుతున్నారు. కాస్ట్ ఫెయిల్యూర్స్ చాలా జరుగుతున్నాయి. అవగాహన లేమితో పరాజయాల్ని కొని తెచ్చుకొంటున్నారు. వాళ్లందరికి కోసం దిల్ రాజు ఇప్పుడు ఓ గైడ్ లా మారబోతున్నారన్నమాట. ఇప్పటికే ఎస్వీసీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఎస్.వి.సీ.సీ ద్వారా పెద్ద సినిమాలు తీస్తున్నారు దిల్ రాజు. రెండోది చిన్న చిత్రాలకు పరిమితమైంది. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్… కొత్త నిర్మాతల కోసం ఏర్పాటు చేసింది. ఇందులో దిల్ రాజు పెట్టుబడి పెడతారు. కొత్త సంస్థలతో భాగస్వామిగా మారి సినిమాలూ తీస్తారు.
2025 నుంచి పాన్ ఇండియా సినిమాలే!
దిల్ రాజు భారీ నుంచి అతి భారీ సినిమాల వైపు దృష్టి నిలిపారు. 2025 నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఫిక్సయారు. జటాయు అనే కథ దిల్ రాజు దగ్గర సిద్దంగా ఉంది. ఇది దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్. 2025లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. వీఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేయాల్సిన సినిమా ఇది. అందుకోసం భారీ కసరత్తులు జరుగుతున్నాయి. ఆ తరవాత కూడా పాన్ ఇండియా సినిమాలే టార్గెటh గా పెట్టుకొన్నారు. మీడియం, చిన్న సినిమాల కోసం దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్ ఎలాగూ ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఆయన్నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి.