మణిపూర్ హింస సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తోంది. అయితే ఈ సందర్భాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జగన్ వినియోగించుకోగలుగుతాడా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే..
లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గట్టెక్కడం బిజెపికి పెద్ద సమస్య కాదు. ఎన్ డి ఏ ప్రభుత్వానికి 350 కి పైగా ఎంపీ సీట్లు ఉండగా, కేవలం బిజెపికే మూడు వందలకు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఇది ఎక్కువే. అయినప్పటికీ ఏ పార్టీ ఎటువైపు ఉంటుంది, ఏ విధంగా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళం ఎత్తుంది అన్న ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు, తమ పార్టీకి అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని ప్రకటించి, 22 ఎంపీ స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న జగన్ ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాడు అన్న చర్చ జరుగుతుంది.
అయితే ఇప్పటికే వైఎస్ఆర్సిపి నేత విజయసాయిరెడ్డి తమ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుందని, ఎన్డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటన, వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్రం మెడలు వంచకపోయినా, మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద ప్రస్తావించి, ఎంతో కొంతవరకు అయినా రాష్ట్రానికి మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి హామీలు పొందుతుందేమో అన్న ఆశను సమాధి చేసింది. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదని, కేంద్రానికి మద్దతు ఇస్తూ కూడా అవిశ్వాస తీర్మానం సందర్భంగా వచ్చే చర్చలో కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన ప్రయోజనాలను పార్లమెంటులో ప్రస్తావించి మరొక విధంగానైనా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి ఒత్తిడి పెంచవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కి మైలేజ్ పెరిగే అవకాశం కూడా కొంతవరకు ఉంది.
మరి అంది వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రత్యేక హోదా సహా బకాయి ఉన్న ఇతర విభజన హామీలను పార్లమెంటులో వైఎస్ఆర్సిపి ఎంపీలు ప్రస్తావిస్తారా లేక తమ పార్టీ అధినేత జగన్ పై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకొని భేషరతుగా మారు మాట్లాడకుండా ఎన్ డి ఏ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేస్తారా అన్నది వేచి చూడాలి.