“నన్ను జైలుకు పంపి మొండిని జగమొండి చేశారు..ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం.. అందుకు తగ్గ సమయం వస్తుంది” అని జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుంది అనే ప్రచారం గత కొద్ది రోజుల కిందట విస్తృతంగా సాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ తీవ్ర ప్రభావం చూపిందని గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి.
అలాగే, ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీ అప్రతిష్టకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది…? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు అయ్యాయి.
కొన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు అనే చర్చ కూడా జరిగింది. కానీ , జైలు నుంచి బయటకొచ్చాక కవిత చేసిన ప్రకటన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసిన కవిత..గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తాననే సంకేతాలు పంపారు.