2004 ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి, ఈ సారి ఛాన్స్ మిస్సయితే ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అని అసామాన్య పట్టుదలతో ప్రయత్నిస్తున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దొరికిన ఓ గొప్ప ఆయుధం పురంధేశ్వరి. తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం గుర్తుండిపోయే నందమూరి తారక రామారావు వారసురాలు, ఆయన అమితంగా ద్వేషించిన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం మామూలుగా పెరగలేదు. అలాగే కుల సమీకరణలు కూడా భలే కలిసొచ్చాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులు అయిన చాలా మంది కంటే డాక్టర్ రామానాయుడు చాలా గొప్ప సర్వీస్ చేశారు. ఆయన సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరీ బొలెడన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేశారు. కానీ పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఆడిన సెంటిమెంట్ రాజకీయం ముందు ఆయన ఓడిపోయాడు. పురంధేశ్వరి కాకుండా వేరే ఎవ్వరితో పోటీ పడి ఉన్నా రామానాయుడు తప్పకుండా గెలిచి ఉండేవాడు. ఈ రోజుకీ కూడా ఆయన చేసిన సేవలను బాపట్ల ప్రజలు తల్చుకుంటూ ఉంటారు.
ఆ విషయం పక్కన పెడితే 2004 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం పురంధేశ్వరి తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నారు. అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి ఎదిగారు. మేధావి అయిన మన్మోహన్ సింగ్ కూడా పురంధేశ్వరి ప్రతిభను వేనోళ్ళ పొగిడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌కి నిజమైన వారసురాలు అని పేరు తెచ్చుకుంది. ఐక్యరాజ్యసమితిలో కూడా అద్భుతంగా ప్రసంగించింది. పార్లమెంట్లో పురంధేశ్వరి ప్రసంగాలను కూడా పార్టీలకతీతంగా ఎందరో పెద్ద పెద్ద నాయకులు ప్రశంసించారు. ఈ వెలుగులన్నీ కొంత కాలమే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ సమ్మతి తెలిపినప్పటి నుంచి మాత్రం పురంధేశ్వరిలో ఊహించని మార్పులు వచ్చాయి. అసలే భయాందోళనలో ఉన్న సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి వాళ్ళ ఆగ్రహాన్ని చవిచూసింది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సమర్ధించేలా మాట్లాడాలని ప్రయత్నం చేసింది. ఆ తర్వాత అనతి కాలంలోనే బిజెపిలోకి జంప్ చేసింది. పురంధేశ్వరి తేెలివితేటలను, నేర్చిని ‘రాజకీయాన్ని’ చూసి తెలుగు ప్రజలు షాక్ అయ్యారు. బహుశా పదేళ్ళుగా తనకు తానుగా పురంధేశ్వరి డెవలప్ చేసుకున్న ఇమేజ్‌ని నిజమని నమ్మినవాళ్ళెవ్వరూ కూడా ఈ జంపింగ్ని ఊహించి ఉండరు.
2014 ఎన్నికలలో ఎందుకు పోటీ చేసిందో, ఎలా గెలుస్తుందో అన్న అవగాహన లేకుండా పోటీచేసి అందరూ ఎంతో ముందుగా ఊహించినట్టుగానే ఓడిపోయింది. అయితే ఆ ఓటమి కూడా పురంధేశ్వరిలో ఎలాంటి మార్పూ తీసుకురాలేదు. వ్యక్తిగతంగా కక్ష్యగట్టి అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపైకి ఒంటి కాలిమీద లేచే లక్ష్మీ పార్వతి స్థాయికి దిగజారుతోంది. కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తోంది. ప్రత్యేకహోదా రావాలంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించాలన్న మాట అయితే హాస్సాస్పదం. పురంధేశ్వరికి ఉన్న విషయావగాహనను ప్రశ్నించేలా చేస్తున్నాయి ఆ మాటలు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే దేనికైనా ఒప్పుకోవచ్చేమోగానీ సంబంధం లేని రాష్ట్రానికి మంచి చేయడానికి ఎందుకు ముందుకు వస్తాడు? అసలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటను ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వింటాడు?
ప్రత్యేక హోదా సీమాంధ్రులకు అత్యవసరం. అది ఎవ్వరూ కాదనలేని నిజం. అదే ప్రత్యేక హోదా సీమాంధ్ర నాయకులకు కూడా అవసరం. రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ కావాలి. లేకపోతే మీడియాలో కనిపించే అవకాశం ఉండదు. అప్పుడప్పుడూ మీడియాలో కనిపించకపోతే ఐదేళ్ళకు ఓ సారి ప్రజల మధ్యకు వెళ్ళే వీళ్ళను ఆ ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది. కానీ అడ్డదిడ్డంగా, ఆలోచనలేకుండా మాట్లాడుతూ మీడియాలో కనిపిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉందని ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఊరుకున్నంత ఉత్తమం..బోడిగుండంత సుఖం అన్న సామెత ఇలాంటి వాళ్ళ కోసమే. చిరంజీవిని చూసైనా పురంధేశ్వరి నేర్చుకోవాలి. బిజెపి నుంచి ఎప్పుడు బిచానా ఎత్తి వేస్తుందా అని బోలెడుమందికి బోలెడు అనుమానాలున్నాయి. ఓ పార్టీతో చర్చలు కూడా నడుపుతున్నారట. అలాంటప్పుడు ఆ పార్టీని నిలబెట్టాలన్న ప్రయత్నం కూడా పురంధేశ్వరికి అవసరం లేదేమో. అయినా ఈ నాయకులందరి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేయడం పైన కంటే చంద్రబాబు నాయుడిని తిట్టటంపైనే ఎందుకుంటుందో అర్థం కావడం లేదు. మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేయడం అంటే గంగలో మునగడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, గుళ్ళ చుట్టూ తిరగడం అనుకునేరు నేతాశ్రీలు.