కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రవేశ పెట్టింది. ఆ కూటమిలోని పార్టీలన్నీ అనకూలం..బీజేపీ కూటమిలోని పార్టీలన్నీ వ్యతిరేకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ,టీడీపీ, బీజేడీ వంటి స్టాండ్ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ ముందుగానే స్పష్టత ఇచ్చింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఇలాంటి సమయంలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం సరికాదని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించేశారు విజయసాయిరెడ్డి.
ఇక తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. నిజానికి అవిశ్వాసం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే చర్చ జరుగుతుంది. కానీ పార్టీల స్టాండ్ ఏమిటో తేలిపోతుంది. బీజేపీ విషయంలో టీడీపీ సాఫ్ట్ గానే ఉంటోంది. వ్యతిరేకించడం లేదు. అలాగని.. అనుకూలంగా కూడా లేరు. తటస్థంగా ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాసం విషయంలో కూడా అంతే తటస్థంగా వ్యవహరించి ఓటింగ్ ను బాయ్ కాట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ టీడీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఒక ఒడిషాలోని బీజేడీ బీజేపీకి మద్దతుగా ఉంటోంది. అనుకూలంగా ఓటు వేయడమో .. లేకపోతే ఓటింగ్ ను బహిష్కరించడమో చేస్తారు. బీజేడీ స్టాండ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. కేంద్రంలో ఎవరు ఉంటే వారికి వారి రాష్ట్ర ప్రయోజనాల మేరకు మద్దతుగా ఉంటారు.