సినిమా నటులంటే బీజేపీకి ప్రత్యేకమైన ఆసక్తి. వారిని పార్టీలోచేరమని బలవంతం చేయదు. కానీ సానుభూతిపరులుగా చూపించడానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తుంది. అలా ఉండకపోతే వ్యతిరేకుల ముద్ర వేయించుకోవాల్సిందే. అందుకే బాలీవుడ్లో ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే వాళ్లంతా బీజేపీ వ్యతిరేకులుగా.. మిగతా వాళ్లు బీజేపీ సానుభూతిపరులుగా మారిపోయారు. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లను బీజేపీ ఎలా వాడుకుంటుందో కళ్ల ముందు ఉంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని టాలీవుడ్లో అమలుచేస్తున్నారు.
గత వారం మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. రాజకీయాలు మాట్లాడారో లేదో కానీ.. దాని గురించి మాత్రం విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. అదే బీజేపీకి కావాల్సింది. ఇప్పుడు నితిన్‌ను పిలుస్తున్నారు. నితిన్.. తెలంగాణ నుంచి టాలీవుడ్లో నిలదొక్కుకున్న హీరో. నితిన్‌తో భేటీ అవడం ద్వారా.. ఆయన బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. దీన్ని కాదనలేని పరిస్థితి నితిన్‌ది. ఎందుకో అందరికీ తెలుసు.
ముందు ముందు మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖుల్ని కూడా బీజేపీలో చేర్చే అవకాశం ఉంది. మంచు మోహన్ బాబు గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. తాను బీజేపీ మనిషినని ఆయన చెప్పుకుంటున్నారు. గతంలో సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో అమిత్ షా నిర్వహించిన యాత్రలో సినీ ప్రముఖుల్నే ఎక్కువగా కలిశారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టాలీవుడ్ నటులను ఆకట్టుకుంటున్నారు. వారు నేరుగా మద్దతు ప్రకటించకపోయినా… భేటీ అయితే చాలు.. తమ ప్రచారం తాము చేసుకుంటామని బీజేపీ నేతల వ్యూహం.