దేశ రాజకీయాల్లో ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రెంట్ దే హావా అనీ, జాతీయ పార్టీలు రెంటికీ అరకొర మెజారిటీ మాత్రమే వస్తుందని తెరాస తీవ్రంగా ప్రచారం చేస్తోంది. నవీన్ పట్నాయ్ ఉన్నారనీ, అఖిలేష్ తమతో వస్తారనీ, మమతా బెనర్జీ మద్దతు ఇస్తారనీ… ఇలా సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈ జాబితాలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటం సహజం. నిన్నటి కేసీఆర్ సభలోగానీ, హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రసంగంలోగానీ, నేటి కేటీఆర్ మాటల్లోగానీ… ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా జగన్ తమ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 16 తెరాసకి, ఏపీలో 25 ఎంపీలు జగన్ కి అన్నట్టుగానే లెక్కలు వేసేసుకుంటున్నారు. సరే, ఎవరి ధీమా వారికి ఉండటంలో తప్పులేదు. అయితే, జాతీయ రాజకీయాలకు రెడీ అవుతున్న తెరాస, వారి దోస్త్ వైకాపాల కామన్ అజెండా ఏంటనేదే ప్రశ్న? ఏ ప్రాతిపదికన ఈ రెండు పార్టీలూ కూటమిలో భాగస్వామ్యమౌతున్నాయి? ఏ ప్రయోజనాల సాధన ఈ రెండు పార్టీల మధ్య ఉమ్మడి అంశం అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా?
వాస్తవం మాట్లాడుకుంటే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రెంట్ కి ఇంతవరకూ ఒక ప్రత్యేక అజెండా లేదు. అజెండా తయారు చేస్తామని అప్పుడెప్పుడో కేసీఆర్ అన్నారుగానీ.. ఆ ప్రయత్నమే ఇంతవరకూ జరగలేదు. జాతీయ స్థాయి అవుట్ లుక్ కనిపించడం లేదు. 16 సీట్లిస్తే జాతీయ రాజకీయాలు చేద్దామని అంటూ స్థానికంగా చెబుతున్నారుగానీ… ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఆకర్షించే అజెండా ఏదీ కేసీఆర్ ప్రకటించింది లేదు. కేంద్రం మెడలు వంచుతాం, దించుతామనే ప్రకటనలే తప్ప… అంశాల వారీగా దేశవ్యాప్త విస్తృత స్థాయి విశాల దృక్పథం అనేది ఫెడరల్ ఫ్రెంట్ కు నాయకత్వం అన్నట్టుగా చెప్పుకుంటున్న పార్టీలోనే కనిపించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.
ఇక, వైకాపా విషయానికొద్దాం. జగన్ కలయికను తెరాస ధ్రువీకరిస్తోందిగానీ, కేసీఆర్ తో ఫెడరల్ ప్రయాణాన్ని జగన్ ఇంకా బలంగా, ధైర్యంగా ఏపీ ప్రజలకు చెప్పలేకపోతున్నారు. అంటే, ఎన్నికల ముందు కేసీఆర్ గురించి సానుకూలంగా మాట్లాడలేని పార్టీ, ఎన్నికల తరువాత అదే కేసీఆర్ తో కలిసి ఏపీ ప్రయోజనాలను సాధించుకునే పరిస్థితి ఉంటుందా? ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల గురించి కేసీఆర్ పాటుపడతారని జగన్ చెప్తారా, తెరాసతో చెప్పించగలరా అంటే… అదీ లేదు. మరి, ఏ రకంగా ఈ రెండు పార్టీల మధ్యా ఫెడరల్ ఫ్రంట్ కట్టే సానుకూలత ఉందంటే… ఒకే ఒక్క ఉమ్మడి రాజకీయ లక్ష్యం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాయి. అంతే.. ఇదే ఈ పార్టీల ఉమ్మడి ఫెడరల్ అజెండా అనడంలో సందేహం లేదు.