తెలుగుదేశం పార్టీ ఈ రోజు సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు వేడెక్కడంతో, తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ రెండు విషయాలపై ఈ సమావేశం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
మొదటిది, అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం కేంద్రం మెడలు వంచడానికి ఉపయోగ పడకపోయినా, దేశవ్యాప్తంగా కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి పార్లమెంటులో చర్చించడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే జగన్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయించుకుంటే తెలుగుదేశం వైఖరి ఎలా ఉండాలనేది ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అలాగే రెండవ విషయం – ప్రత్యేక ప్యాకేజీ మీదే భవిష్యత్తులోనూ పోరాడాలా లేదంటే ప్రత్యేక హోదా కోసం గళం ఎత్తాలా అన్నది కూడా నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోదా పై సెంటిమెంటు రగలనుందనే అంచనాలతో ఈ అంశం చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ రెండు అంశాలతో పాటు మరో ముఖ్యమైన అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ఈ నెల 23వ తేదీన సమావేశానికి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ప్రభుత్వానికి పిలుపు వచ్చింది. అయితే ఈ సమావేశానికి అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళాలా, వద్దా అన్న అంశంపై చర్చించనున్నారు . ఒకవేళ అఖిల పక్షాన్ని పిలిస్తే జగన్ మరియు వైసిపి పార్టీ వైఖరి ఎలా ఉండొచ్చు? కలిసి వస్తారా లేక ఇబ్బంది పెడతారా అన్నది కూడా చర్చించనున్నారు. అఖిలపక్షానికి ఏ ఏ పార్టీలని ఆహ్వానించాలి అన్నది కూడా చర్చించనున్నారు.
మొత్తానికి ఉన్నపళాన ఆంధ్ర రాజకీయాలు వేడెక్కడంతో ఈ సమావేశం ఏం నిర్ణయించనున్నారు అనేది ఆసక్తికరం గా మారింది.