ప్రస్తుతం బీఆర్ఎస్ కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోగానే విషమ పరిస్థితులను చవిచూస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కారు టికెట్ కు భలే గిరాకీ ఉండేది. ఇప్పుడు టికెట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇచ్చినా అలా తీసుకొని ఇలా వెనక్కి ఇచ్చేస్తున్న అవమానకర పరిస్థితిని ఎదుర్కొంటుంది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కారు – సారూ.. పదహారు అంటూ తెగ హడావిడి చేసిన బీఆర్ఎస్ ఇప్పడు ఏ నినాదం లేకుండానే ముందుకు సాగుతోంది. తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్సేనని మొదట కేటీఆర్ నినాదం ఇచ్చారు. ఈ కొత్త స్లోగన్ తో లోక్ సభ ఎన్నికలకు వెళ్తారని అనుకున్నా ఎందుకో ఆ నినాదం మళ్ళీ వినిపించడం లేదు. రాజకీయ ఎదుగుదల కోసం పార్టీ పేరులో తెలంగాణను ఎత్తేసిన మీరు.. తెలంగాణ బలం, దళం, గళం ఎలా అవుతారన్న ప్రశ్నలు రావడమే అందుకు కారణమా..? అనేది తెలియదు. కానీ, ఎన్నికల నినాదం అనుకున్న ఆ స్లోగన్ ను పక్కన పెట్టడం వెనక కారణాలేంటో పార్టీ వర్గాలకు సైతం అంతుచిక్కడం లేదు.
కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో నినాదం, విధానం ఉంది. కానీ, బీఆర్ఎస్ కే ఓ నినాదం, విధానం లేకుండా పోవడం మైనస్. ఇదే అదునుగా భావించిన జాతీయ పార్టీలు రెండూ… బీఆర్ఎస్ ను హేళన చేస్తున్నాయి. ఆ పార్టీకి ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని జనాల్లో చర్చను లేవదీస్తున్నాయి. ఈ రకమైన వాదనను జనం విశ్వసిస్తే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండు చోట్ల కూడా గెలిచే అవకాశం లేదన్నది క్లియర్.