బాలీవుడ్ లో వచ్చిన ‘కిల్’ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా హాలీవుడ్ కి రిమేక్ గా వెళుతోంది. జాన్ విక్ డైరెక్టర్ ‘కిల్’ హక్కులని కొనుగోలు చేశాడు. తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. చివరకి డైరెక్టర్ రమేష్ వర్మ సొంతం చేసుకున్నారు. ఫిలిం మేకర్స్ ఇంతలా కొరుకునే కంటెంట్ ‘కిల్’లో ఏముందనే ఆసక్తి రావడం సహజమే. నిజంగా ‘కిల్’ యాక్షన్ లవర్స్ ని కట్టిపడేసే సినిమానే. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ గొప్ప కన్విక్షన్ తో సినిమా తీశాడు. ఇది మామూలు యాక్షన్ సినిమా కాదు. సీట్ఎడ్జ్, జా డ్రాపింగ్ అంటారు కదా.. ఈ మాటలు కిల్ సినిమాకి యాప్ట్. సింగిల్ లైన్ వున్న కథ. ఒక ట్రైన్ లో నలభై మంది బందిపోట్లు చొరబడతారు. ఆ బందిపోట్లని ఒక ఎన్ఎస్జీ కమాండర్ అతి దారుణంగా చంపేస్తాడు. ఇదే కథ. ఈ లైన్ లో ఏముంది గొప్పదనం అనుకోవచ్చు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మామూలుగా వుండదు. సినిమాకి కనెక్ట్ అయిన ఆడియన్స్ చివరి వరకూ దవడ బిగపట్టి చూస్తారు.
ఒక వ్యక్తి నలభై మందిని చంపాలంటే ఎదో రివెంజ్ వుండాలి. ఈ కథలో కూడా రివెంజ్ వుంది. బేసిగ్గా రివెంజ్, ఆడియన్స్ కి పట్టడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇందులో ఒకటే సీన్ లో ఆ ఎమోషన్ ని ఎక్కించేస్తాడు దర్శకుడు. హీరో ప్లేస్ కి ఆడియన్ వెళ్ళిపోతాడు. ఆ దొంగల్ని అతి దారుణంగా చంపేయాలనే ఎమోషన్ ఆడియన్ కి పట్టేస్తుంది. డైరెక్టర్ ఆ సీన్లన్నీ ఎంత ఆర్గానిక్ గా తీసాడంటే ఆ ట్రైన్ లో ప్రేక్షకుడూ ఓ ప్రయాణికుడిగా మారిపోతాడు. సినిమా అంతా రక్తపాతమే. ప్యూర్ గా యాక్షన్ ఆడియన్స్ కోసం చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నచ్చే సినిమా.
ఇప్పుడీ సినిమా తెలుగులో రావడం ఖాయమైపోయింది. ఇలాంటి రక్తపాతం వున్న కంటెంట్ తెలుగులో ఆడుతుందా లేదా ? అనేది ప్రశ్న. అదలావుంచితే.. ఈ సినిమాని రిమేక్ చేయడం కూడా కత్తిమీద సామే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎక్కువ మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ లేదు ఇందులో. మార్పులు చేసినా సారం దెబ్బతినే ప్రమాదం వుంది. యాక్షన్ డైరెక్టర్ కి ఎక్కువ పని వున్న సినిమా ఇది. యాక్షన్ ని చాలా రియలెస్టిక్ గా తీశారు. కంట్లో కత్తితో పొడిస్తే నిజంగా పోడిచేసినట్లే వుంటుంది.
హీరోని ప్రజెంట్ చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క స్లో మోషన్ షాట్ వున్న ఫీల్ పోతుంది. కెమరా రియల్ టైంలో వుండాలి. అనవసరమైన ఎఫెక్ట్ లు వాడి యాక్షన్ లో ఏవో జిమ్ములు చేయాలని చూస్తే మాత్రం ఆడియన్స్ ద్రుష్టి పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం వుంది. తెలుగులో హీరోగా ఎవరినీ ఎంచుకున్నా సరే తనొక ఎన్ఎస్జీ కమాండర్ అంటే నమ్మగలిగే ఫిజిక్మ ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఫణి అనే విలన్ క్యారెక్టర్ వుంటుంది. రాఘవ్ అనే యాక్టర్ ఈ క్యారెక్టర్ చేశాడు. కుదిరితే అతడినే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మామూలుగా చేయలేదు. నిజంగా అవుట్ స్టాండింగ్. ఒరిజినల్ లో వున్న ఫీల్ తో సినిమాని తీయగలిగి, సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తే గనుక తెలుగులో కూడా ఓ కొత్త జానర్ యాడ్ అయినట్లే.