అమరావతికే మా మద్దతు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీలో అడుగు పెట్టిన సందర్భంగా తేల్చిచెప్పేశారు. ఏకైక రాజధానిగా తమ ఓటు అన్నారు. బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇది అమరావతి రైతుల్లో ఏమన్నా దైర్యం నింపుతోందా అంటే .. అలాంటిదేమీ లేదని చెప్పాలి. బీజేపీ మద్దతు ఇస్తే ఓ రకంగా భరోసా ఉండాలి. ఎలాంటి మద్దతు ఉన్నా తమకు అన్యాయం జరగదన్న నమ్మకంతో ఉండాలి. కానీ బీజేపీ నేతల మాటలు మాత్రం అలాంటి భరోసా ఇవ్వడం లేదు.
బీజేపీ కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో పార్టీ. అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు . అలాంటి రాజధానికి గత మూడున్నరేళ్లుగా ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్ల ముందే కనిపిస్తోంది. బీజేపీ మద్దతు లేకుండా ఇలా సాధ్యం కాదు. మద్దతు ఇవ్వకపోయినా చూస్తూ అయితే ఉన్నారు. చివరికి రాజ్యాంగబద్ధంగా.. న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తేలిన తర్వాత.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేస్తున్న వ్యవహారాలపై కేంద్రం చూస్తూనే ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ రాష్ట్రానికి వస్తున్న నేతలు మాత్రం రాజధానిగా అమరావతికే మా మద్దతు అని ప్రకటిస్తున్నారు.
ప్రజలకు.. అమరావతి రైతులకు నమ్మకం కలిగించాలంటే.. బీజేపీ నేతలు ప్రకటనలు కాదు. తక్షణం అమరావతి విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అధికారిక రాజధానిగా గుర్తించి.. తిరుగులేని విధంగా ఉండేలా కార్యాలయాలను ఏర్పాటుచేయాలి . కేంద్రం అక్కడ ఆఫీసుల్ని ప్రారంభించాలి. తరలించలేని విధంగా వ్యవహరించాలి. అలాంటి చర్యలు లేనంతకాలం.. బీజేపీని అమరావతి విషయంలో ప్రజలు పెద్దగా నమ్మే చాన్స్ ఉండదు.