ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా పోరాటం సాగిస్తున్న అధికార పార్టీ టీడీపీ, ఇప్పుడు మరింత శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే, ఢిల్లీలో టీడీపీ ఎంపీలు హోదా సాధన కోసం నిరసనలు చేపడుతున్నారు. బడ్జెట్ సమావేశాల నుంచీ మొదలుకొని… కేంద్రమంత్రుల రాజీనామా, అవిశ్వాస తీర్మానం, పార్లమెంటు వాయిదా అనంతరం ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ఇకపై, అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. పోరాటంలో భాగంగా రాష్ట్రంలో వివిధ సంఘాలతోపాటు, మేధావులతో అఖిల పక్షాలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజక వర్గాలవారీగా సైకిల్ యాత్రలు చేపట్టబోతున్నారు. ఇదే అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వ్యూహ కమిటీ సమావేశం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా ఢిల్లీలో హోదా పోరాటం చేస్తున్న ఎంపీలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. వారి పోరాటం అందరినీ ఆకర్షించిందన్నారు. మరో వారం రోజులలోపు ఎంపీల బస్సు యాత్ర ఉంటుందని నిర్ణయించారు. ఈ యాత్రలో ఢిల్లీలో టీడీపీ చేసిన ప్రయత్నాన్నీ, వైకాపా చేసిన స్వార్థ రాజకీయాలను ప్రజలకు సవివరంగా చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ వ్యూహ కమిటీలో మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్,యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు లతోపాటు ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.
పార్లమెంటు సమావేశాల నిరవధిక వాయిదా తరువాత, ఇప్పుడు హోదా పోరాటం ఎటువైపునకు సాగుతుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏం చేసినా కేంద్రం స్పందించదు అనేది దాదాపు స్పష్టమైపోయింది. ఇక, రాష్ట్ర స్థాయిలో టీడీపీ నిరసనలు అంటే.. అది వైకాపా, భాజపాలు చేసే ఆరోపణలూ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేందుకే పనికొస్తుంది. పార్టీపరంగా ఇదీ అవసరమే.. కానీ, దీంతోపాటు జాతీయ స్థాయిలో పోరాటమేంటీ, కార్యాచరణ ఎలా అనే స్పష్టత కూడా ఇప్పుడు అవసరం. జాతీయ స్థాయిలో చూసుకుంటే మోడీ సర్కారు వైఫల్యాల్లో ఏపీ హామీలు నెరవేర్చకపోవడం అనేది కీలకాంశంగా ఉంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని.. ఒక ఉమ్మడి కార్యాచరణ కోసం తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని కథనాలు వచ్చాయి. అయితే, తదనంతర వ్యూహాలేంటనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలాగూ వైకాపా చివరి అస్త్ర ప్రయోగం జరిగిపోయింది కాబట్టి, ఇకపై వారు ప్రత్యేకంగా కేంద్రంపై ఏదో పోరాటం చేస్తారనే ఆశలు ప్రజలకీ లేవు. ఆశలన్నీ ఇప్పుడు టీడీపీపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు భవిష్యత్తు వ్యూహం ఎలా ఉంటుందనేది కాస్త వేచి చూడాలి.