బీజేపీపై పోరాటంలో మమతా బెనర్జీ కూడా అలసిపోయినట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గంలో నెంబర్ టు లాంటి పార్థాచటర్జీని ఈడీ అరెస్ట్ చేస్తే కనీసం కుట్ర అని వ్యతిరేకించలేని దుస్థితికి తృణమూల్ వెళ్లిపోయింది. పార్థా ఛటర్జీ 2014 నుంచి మంత్రిగా ఉన్నారు. ఉపాధ్యాయ నియామకంలో అవినీతికి పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. నిజానికి ఈడీ అనేది అక్రమ నగదు లావాదవీలపైనే కేసు పెట్టగలదు. కానీ బెంగాల్లో జరుగుతోంది వేరు. కానీ తృణమూల్ నోరెత్తలేని పరిస్థితి.
తనను అరెస్ట్ చేస్తున్నారని కాపాడాలని మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పార్థా చటర్జీ వాపోయారు. అయితే అరెస్ట్ తర్వాత ఆయన ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంటే.. మమతకు ఎలా ఫోన్ చేస్తారని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ అధికారులు ఫోన్ చేయించి మమతా బెనర్జీని కూడా ఇరికించే ప్రయత్నం చేశారని తృణమూల్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఈ విషయాన్ని అరెస్ట్ మెమోలోనూ ఈడీ అధికారులు పెట్టారని అంటున్నారు. కానీ ఈ కేసు విషయంలో పార్థాచటర్జీకి అనుకూలంగా కానీ.. దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా కానీ మాట్లాడలేని పరిస్థితి.
గతంలో బీజేపీ పెట్టే కేసులపై రాజీ లేని విధంగా మమతా బెనర్జీ పోరాడారు. కేసుల భయంతో తమ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయినా ఆమె వెనక్కి తగ్గలేదు. బెంగాల్లో ఘన విజయం సాధించిన తరవాత ఇప్పుడు కొత్త కేసులు చుట్టు ముడుతున్నాయి. కానీ సొంత మంత్రిని వెనకేసుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనను దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితి తృణమూల్‌ను బలహీన పరుస్తుంది. అయినా మమతా బెనర్జీ ఆత్మరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. పరిస్థితి చూస్తే బీజేపీపై పోరాటంలో మమతా బెనర్జీ కూడా అలసిపోయారన్న వాదన వినిపిస్తోంది.