ఏ ప్రభుత్వంలోనైనా సరే అవసరమైన పదవులకు మించి అనవసరమైన పదవులు ఎక్కువగా ఉంటాయి. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం జీతాలకే పోతుందనే విషయం అందరికీ తెలుసు. ఈ జీతాలు తీసుకునేది పనికొచ్చే, పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, పనికిమాలిన, అవసరంలేని పదవుల్లో ఉండే సలహాదారులు, ఆ బాపతు ఇతర పదవుల్లో ఉండేవారు కూడా. అందుకే చాలా డబ్బు ఇలా వృథాగా ఖర్చవుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి తన పార్టీలోని నాయకులందరికీ మంత్రి పదవులు ఇవ్వలేడు కదా. మంత్రి పదవులు దక్కనివారికి నామినేటెడ్ పదవులు ఇస్తారు. ఎన్నో ప్రభుత్వ కార్పొరేషన్లు ఉంటాయి కదా. వాటి అధిపతులుగా అంటే చైర్మన్లుగా అధికార పార్టీ నాయకులే ఉంటారు. అట్లా కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. అయినప్పటికీ ఇంకా బోలెడుమంది నాయకులు, విధేయులు, ఎన్నికల్లో టికెట్లు రానివారు, ముఖ్యమంత్రి ఊరోళ్లు, ఆయన కులపోళ్ళు, పార్టీకి ఆర్ధికంగా అండగా నిలిచేవారు …ఇలా ఎన్నో కేటగిరీలవారు ఉంటారు. మరి వారినందరినీ సంతృప్తి పరచాలి కదా. ఇలాంటోళ్ళందర్నీ సలహాదారులుగా నియమిస్తుంటారు. ఈ సలహాదారులు పార్టీ నాయకులు కావొచ్చు, కాకపోవొచ్చు. కొందరు పొలిటికల్, నాన్ పొలిటికల్ కూడా ఉంటారు. నాన్ పొలిటికల్ వారికి పార్టీతో సంబంధం లేకపోయినా పార్టీ సానుభూతిపరులై ఉంటారు లేదా ముఖ్యమంత్రికి విధేయులై ఉంటారు. సలహాదారుల్లో నిపుణులు చాలా తక్కువమంది ఉంటారు. వాస్తవానికి సలహాదారులంటే ఆయా రంగాల్లో నిపుణులై ఉండాలి.
కానీ ఇప్పటి ప్రభుత్వాల్లో నిపుణులు తగ్గిపోయారు. కొందరికి ఉపాధి కల్పించడానికి సలహాదారులుగా పెట్టుకుంటున్నారు. వీరికి కేబినెట్ హోదా ఉంటుంది. అంటే మంత్రులతో సమానమన్నమాట. బుగ్గ కారు, భారీగా జీతం, కొంతమంది సిబ్బంది వగైరా హంగులుంటాయి. ఇలా వైభవంగా బతికే ఈ సలహాదారులు ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. వారు మీడియాకు కనబడరు. మీడియాతో మాట్లాడారు. నిజానికి ఆ అవసరం వారికి లేదు. ఎందుకంటే వారు సర్కారుకు సలహాలు ఇచ్చేవారు మాత్రమే. వీరు ఏం సలహాలు ఇస్తారో, అవి ప్రజాసంక్షేమానికి ఎలా ఉపయోగపడతాయో తెలియదు. ఎందుకంటే సలహాదారులంతా నిపుణులు కారు. ప్రభుత్వ పరిపాలనంతా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల ద్వారా జరుగుతుంది. వివిధ పథకాలకు రూపకల్పన చేసేది సివిల్ సర్వీస్ అధికారులే. పరిపాలనకు సంబంధించి సీఎంకు సలహాలు ఇచ్చేది వీరే. అయినప్పటికీ సలహాదారులంటూ ప్రత్యేకంగా నియమిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వాస్తుకు కూడా సలహాదారు ఉన్నాడంటే ఈ పదవులు ఎంత పనికిమాలినవో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో ఆయనకు కూడా లెక్క తెలియకపోవచ్చు. మంత్రులకు మించి సలహాదారులు ఉన్నారని వైకాపా నాయకులే చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే సలహాదారు పదవులను జగన్ పిప్పరమెంట్ల మాదిరిగా పంచిపెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన సామాజిక వర్గంవారు, ఆయన విధేయులు అనేకమంది సలహాదారులుగా ఉన్నారు. వీరికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా చెల్లిస్తున్నారు. సాక్షి మీడియాలో (పేపర్, టీవీ) కీలక స్థానాల్లో పనిచేసిన పలువురు ఇప్పుడు ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. వీరిలో కొందరు తెలంగాణావారూ ఉన్నారు. ఇంతమంది సలహాదారులను జగన్ ఎందుకు పెట్టుకున్నాడో, కొత్తగా ఎందుకు పెట్టుకుంటున్నాడో అర్థం కావడంలేదు. ప్రస్తుతం కరోనా ఏపీని కూడా వణికిస్తున్న తీరును చూస్తున్నాం. ఈ పరిస్థితిలోనూ జగన్ ఒక సలహాదారును, ఏపీపీఎస్సీలో ఒక సభ్యుడిని నియమించాడు. వీరిలో ఒకాయన పేరు ధనుంజయ రెడ్డి. ఈయన ఈ మధ్యదాకా సాక్షి రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేశాడు. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడాయన ప్రభుత్వంలో భాగమయ్యాడు. ఈ ధనుంజయ రెడ్డి పంచాయతీలకు, గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి సలహాలు ఇస్తాడట. ఇక రమణారెడ్డి అనే ఆయన్ని ఏపీపీఎస్సి సభ్యుడిగా నియమించారు. ఈయన ప్రముఖ విద్యా సంస్థల అధిపతి. ధనుంజయరెడ్డి, రమణారెడ్డి ఇద్దరూ జగన్ సామాజిక వర్గమని తెలుస్తూనే ఉంది కదా. వచ్చే నాలుగేళ్లలో ఇంకెంతమంది సలహాదారులు వస్తారో.