ఐదురాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. బీజేపీ పోటీ పడుతోంది రెండు రాష్ట్రాల్లోనే ఒకటి అసోం. ఇప్పటికే అక్కడ అధికార పార్టీ. రెండు బెంగాల్. కింది నుంచి ఎదిగి అధికారం కోసం పోటీ పడుతోంది. ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఆ పార్టీది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా హడావుడే తప్ప… విషయం లేదు. కానీ కొద్ది రోజులుగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ హంగామా మాత్రం చేస్తోంది. తమిళనాడులో రజనీకాంత్ పైచాలా ఆశలు పెట్టుకుంది.కానీ ఆయన హ్యాండిచ్చారు. దీంతో శశికళ వైపు దృష్టి సారించారు. ఆమెను రిలీజ్ చేశారు. అన్నాడీఎంకేను ఆమె చేతుల్లో పెట్టడానికి పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తులు పెట్టుకుంది. అయితే అక్కడ ఈ సారి ప్రజలు ప్రయోగం చేయదల్చుకోలేదని స్టాలిన్‌కే పట్టం కడతారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
కేరళలో వింత వింతప్రయోగాలను బీజేపీ చేస్తోంది. కొంత మంది ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటోంది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ బీజేపీలోకి చేరికకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు పరుగుల రాణి పీటీ ఉష కూడా బీజేపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు మద్దతుగా పీటీ ఉష ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఉష బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారమవుతోంది. పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. మోడీ అక్కడ ప్రచారసభ పెట్టి.. బీజేపీ వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే అక్కడ పరిస్థితులు అలా లేవు.
అసోంలో తొలి సారి బీజేపీ అధికారం చేపట్టింది. కానీ ఎన్నార్సీ వివాదంతో ప్రజల్లో ఆభద్రతా భావాన్ని సృష్టించింది. ఓ వర్గంపై మెజార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇది ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అన్నదానిపైనే బీజేపీ సక్సెస్ అధారపడి ఉంది. అధికార వ్యతిరేకత సహజంగా ఉండే అంశం. ఇక బెంగాల్లో మాత్రం.. అధికారంలో లేదు.. మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే అక్కడా అధికారంలోకి రావడం కష్టమని.. కాకపోతే.. బాగా మెరుగుపడుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బీజేపీకి ఈ ఎన్నికల్లో అనుకున్నంత సానుకూల పరిస్థితులు ఉండవంటున్నారు. అదే సమయంలో పెట్రో ధరలు.. నిత్యావసర వస్తువుల ధరల మంట సామాన్యుడికి తగిలితే.. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్య పోనవసరం ఉండదంటున్నారు.