మారిషస్ బ్యాంకుకు వందల కోట్ల రూపాయల అప్పు ఎగవేసిన కేసులో కేంద్రమంత్రి సుజనా చౌదరి పీకల్లోతు కూరుకుపోయి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వ్యవహారంనుంచి లౌక్యంగా బయటకు రావడానికి న్యాయపరంగా ఉన్న లొసుగులు అన్నిటినీ వాడుకుంటూ.. వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ.. సుజనా చౌదరి రోజులు నెట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే సుజనాచౌదరి భవిష్యత్తు ఏమిటి అనేదే సందేహాస్పదంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి సుజనా పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఆయన ఏదో కేంద్రమంత్రి పదవిలో ఉన్నారు గనుక.. వ్యవహారం అంతా చూసీ చూడనట్లుగా గడచిపోతున్నది అనుకోవచ్చు. ఈ జూన్లో ఆయన పదవీ కాలం పూర్తయిపోతున్నది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయాలు, సుజనాచౌదరికి చంద్రబాబునాయుడు వద్ద తగ్గుతున్న ప్రాధాన్యం, ఇలాంటి నేపథ్యంలో సుజనాకు రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్లీ పొడిగించకపోవచ్చుననే సంకేతాలు కూడా వస్తున్నాయి. సీట్లు ఖాళీ అయితే.. ఏపీకి దక్కే అవకాశం తక్కువగా ఉండడం, వెంకయ్యనాయుడుకు కూడా మళ్లీ అవకాశం కల్పించి, తదనుగుణమైన ప్రయోజనాలు కేంద్రంనుంచి పొందాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తుండడం ఎఫెక్టుకూడా సుజనాకు పొడిగించబడకపోవచ్చు.
ఆ నేపథ్యంలో అటు ఎంపీ పదవి లేకుండా, కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా దిగిపోతే.. జూన్ తర్వాత.. మారిషస్ బ్యాంకును మోసం చేసి అప్పు తీసుకుని ఎగవేసిన ఒక మామూలు పారిశ్రామిక వేత్తగా మాత్రమే మిగులుతారు. అవతలి బ్యాంకులు గానీ, కోర్టులు గానీ.. ఆయన పట్ల ప్రస్తుతం ఉపేక్షిస్తున్న ధోరణిలో జూన్ తర్వాత ఉండకపోవచ్చు. మరింత గట్టిగా ఆయన చుట్టూ చట్టం బిగుసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం నాంపల్లి కోర్టు సుజనా చౌదరి అండ్ కో కు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు రేగుతున్నాయి. భవిష్యత్తులో సుజనాకు చిక్కులు తప్పవేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.