అగ్రరాజ్యం అమెరికా కొత్త ప్రెసిడెంట్ ఎవరా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరగా మారింది. ప్రైమరీల్లో దూసుకు పోతున్న హిలరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది మరో ఆసక్తికరమైన వియం.
హిలరీ గెలిస్తే ఒబామా విధానాలే చాలా వరకు అమలవుతాయి. భారతీయ అమెరికన్లకు కొన్ని ముఖ్యమైన పదవులు దక్కవచ్చు. కానీ విదేశీ వ్యవహారాల విషయంలో మాత్రం భారత్ కు భిన్నమైన విధానం అమల్లో ఉంటుంది. ఉగ్రవాదంపై పోరు పేరుతో పాకిస్తాన్ కు మిలియన్లకొద్దీ డాలర్లు సహాయంగా ఇవ్వడం, యుద్ధ విమానాలు అమ్మడం వంటివి భారత్ కు వ్యతిరేకమైన చర్యలే. ఎంతో మంది చట్టసభల సభ్యులు వ్యతిరేకించినా ఒబామా ప్రభుత్వం మాత్రం పాక్ విషయంలో తన వైఖరిని మార్చుకోక పోవడం భారత్ కు నచ్చని విషయం.
డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే భారత్ కు అనుకూలమైన విషయాలే ఎక్కువగా ఉండొచ్చు. డ్రాగన్ చైనాకు చెక్ పెట్టడం ట్రంప్ కే సాధ్యం కావచ్చు. చైనా ప్రవర్తన మారకపోతే, అవసరమైతే యుద్ధానికి సిద్ధమని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. మనకు బద్ధ శత్రువు, ఇప్పటికే పెద్ద ఎత్తున మన భూభాగాన్ని కబళించిన చైనాకు చెక్ పెట్టే అధ్యక్షుడు అమెరికాలో ఉంటే అది మనకూ మంచిదే. సరిహద్దుల్లో ఇప్పటికే తరచూ వివాదాలు లేవనెత్తే చైనాను ఎదుర్కోవాలంటే ఇలాంటి బలమైన అండ మనకు కావాల్సిందే.
పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమనేది ట్రంప్ అభిప్రాయం. భారతీయుల అభిప్రాయం కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా బలగాలు ఉండాలని, తాలిబన్ ఉగ్రవాదులకు చెక్ పెట్టాలని ట్రంప్ అభిప్రాయం. ఉగ్రవాదుల స్వర్గధామం అమెరికాలో అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి వెళ్లకుండా, భద్రంగా ఉండేలా అమెరికా చూడాలని అన్నారు.
ఉగ్రవాదులను హింసించడానికి పోలీసులకు అవకాశాన్నిచ్చేలా చట్టాలు ఉండాలనేది ట్రంప్ అభిప్రాయం. మనం రూల్స్, చట్టాలని చేతులు ముడుచుకోవడం, ఉగ్రవాదులు మాత్రం ఇష్టారాజ్యంగా చెలరేగిపోవడం కరెక్ట్ కాదంటారు. ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు శిక్షించడానికి కూడా అనుగుణంగా చట్టాలు చేస్తానన్నారు. ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతాననే ట్రంప్ మాటలు అమెరికాలో చాలా మందికి నచ్చుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువత, మధ్య తరగతి అమెరికన్లలో చాలా మంది ఆయన విధానాలను సమర్థిస్తున్నారట.
ఇక, ఉద్యోగాల విషయంలో భారతీయ అమెరికన్లకు కొన్ని భయాలున్నాయి. దీనికి కారణం ట్రంప్ వ్యాఖ్యలే. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు, చైనీయులు కొల్లగొట్టారని ట్రంప్ ఆ మధ్య ఆరోపించారు. తాను అధ్యక్షుడిని అయితే ఆ ఉద్యోగాలను తిరిగి అమెరికన్లకు ఇప్పిస్తానన్నారు. హెచ్ 1 బి వీసా విధానాన్ని రద్దు చేస్తానన్నారు. అయితే, అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు చాలా తెలివైన వారని ప్రశంసల వర్షం కురిపించారు. వాళ్ల సేవలు అమెరికాకు అవసరం. వాళ్లు స్వదేశానికి వెళ్లి అద్భుతాలను చేయగల సత్తా ఉన్నవారు. కానీ భారత్ కు తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే మంచి అవకాశాలు ఇచ్చి, వాళ్ల సేవలను ఉపయోగించుకుందాం అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల ఆందోళనలో అర్థం ఉంది. అయితే, ఇంజినీరింగ్, ఇతర రంగాల ఉద్యోగాలు చేయడానికి అర్హులైన అమెరికన్లు దొరకడం అరుదు. అమెరికాలో చాలా మంది 12వ తరగతి వరకు మాత్రమే చదువుతారు. ఎందుకంటే అక్కడి వరకూ ఉచిత విద్య కాబట్టి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదివే వారిలో మెజారిటీ విదేశీ విద్యార్థులే. కాబట్టి అలాంటి ప్రత్యేక స్కిల్ అవసరమైన ఉద్యోగాల్లో ఉన్న భారతీయులకు డోకా ఉండకపోవచ్చు. పైగా, భారతీయుల పట్ల ట్రంప్ కు ఉన్న అభిప్రాయాలను బట్టి, అమెరికాలో అమల్లో ఉన్న ప్రజాస్వామిక విధానాలను బట్టి, మూకుమ్మడిగా ఉద్యోగంలోంచి పీకెయ్యడానికి అవకాశం ఉండక పోవచ్చు. కాబట్టి, ట్రంప్ ఇప్పుడు చెప్తున్న విధానాలే గనక అమలు చేస్తే, భారత్ కోణంలో అమెరికాలో పరిపాలన సాగించే ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. భారత్ పెద్ద మార్కెట్. కాబట్టి, ఏటా బిలియన్లకొద్దీ డాలర్ల విలువైన అమెరికా వస్తువుల అమ్మకానికి మంచి దేశం. ఒబామా అయినా, ట్రంప్ అయినా భారత్ ను వీలైనప్పుడల్లా పొగడటానికి ఇదే ప్రధాన కారణం. అయితే పాకిస్తాన్ , ఉగ్రవాదం విషయంలో మాత్రం ట్రంప్ అభిప్రాయాలు భారత్ కు దగ్గరగా ఉండటం విశేషం.