ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిస్తున్న వెబ్ సిరీస్ ‘అడాలసెన్స్’. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ నాలుగు ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్ అందరినీ ఆలోచనల్లో పడేసి ఒక సీరియస్ చర్చకు దారితీసింది. యూకే ప్రధాని ఈ సిరిస్ ని స్కూల్ లో స్క్రీన్ చేసి సోషల్ మీడియా విష వలయం నుంచి కౌమారదశ పిల్లలని కాపాడాలని ఓ సూచన చేశారు. మరి ఇంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో ఏముంది?
మనిషి జీవితంలోని చాలా ముఖ్యమైన కౌమారదశని సోషల్ మీడియా ఎంతలా ప్రభావం చూపిస్తోందో, ఇన్ఫ్లూయన్సర్ల కంటెంట్ పసి హృదయాలపై ఎలాంటి విష బీజాలు నాటుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఒక హత్యని నేరమూ శిక్ష అనే ధోరణిలో కాకుండా నేరమూ అది జరగడానికి గల సామాజిక పరిస్థితులు నేపధ్యంలో తీర్చిదిద్దిన సిరీస్ ఇది.
కేటీ అనే14 అమ్మాయిని తన క్లాస్ మేట్ జేమీ అనే అబ్బాయి కత్తితో పొడిచి చంపేస్తాడు. అసలు జెమీ ఎందుకంత ఘాతుకానికి వడిగట్టాడనేది నాలుగు సింగిల్ షాట్ ఎపిసోడ్లలలో చూపిచారు. ఇదేదో థ్రిల్లర్ వెబ్ సిరిస్ అని చూస్తే ఖచ్చితంగా నిరాశపడతారు. సిరీస్ చాలా చోట్ల బోర్ కొడుతుంది. సింగిల్ షాట్ కారణంగా అవసరానికి మించి లాగుతున్నారనే ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ ఇవన్నీ దాటి ఈ సిరీస్ ని చూడగలిగితే.. సోషల్ మీడియా ఇన్ఫెక్షన్ కౌమారదశని ఎలా ప్రభావితం చేస్తోందో, అసలు పిల్లలు ఎలాంటి కంటెంట్ ని చూస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏ విషయంలో పరిజ్ఞానం పెంచుకుంటున్నారు? వాళ్ళ మానసిక స్థితి ఏమిటి? ఎప్పుడూ పిల్లలు ఐక్యూ గురించే అలోచించే తల్లితండ్రులు ఒక్కసారైనా ఎమోషనల్ కోషేంట్ గురించి పట్టించుకుంటున్నారా? వాళ్ళలో ఎలాంటి క్యారెక్టర్ డెవలప్ అవుతుంది? అమ్మాయిలు ఏ దృష్టి చుస్తున్నారు? ఈ అంశాలన్నీ దిగ్బ్రాంతిని కలిగించేలా వుంటాయి.
ఇందులో ఓ సీన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన టీనేజర్ కొడుకుతో కేసు గురించి మాట్లాడతాడు. అప్పుడా టీనేజర్ కుర్రాడు వాడిన కొన్ని పదాలకు సరైన అర్ధం కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరైన తండ్రికి తెలీదు. ఇన్సెల్, మానోస్పియర్, రెడ్ పిల్, బ్లూ పిల్, 80-20 రూల్, కిడ్నీ బీన్స్, రెడ్ హార్ట్ .. ఈ పదాలన్నీ విని అందులో అర్ధం తెలుసుకొని ఆశ్చర్యపోతాడు తండ్రి. సోషల్ మీడియా సృష్టించి ఈ పదబంధం, ఎమోజీల వెనుక వున్న అంతరార్ధం విని షాక్ అవుతాడు. పిల్లలకు పేరెంట్స్ మధ్య ఎంత గ్యాప్ వుంది? పిల్లలు ఎలాంటి విషయాల్ని మెదడుకి ఎక్కించుకుంటున్నారు? పేరెంట్స్ కి తెలియకుండా కౌమారదశలోనే వాళ్ళకంటూ ఓ ప్రపంచాన్ని ఎలా సృష్టించుకుంటున్నారు? మంచు చెడు విచక్ష లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ సిరీస్ చెప్పకనే చెబుతుంది.
నిజానికి జేమీ పాత్రని జనరలైజ్ చేయకూడదు. అది ప్రత్యేకమైన కేసు గానే చూడాలి. ఈ సిరీస్ సృష్టికర్తల లక్ష్యం కూడా ఇదే. ఒక నేరం జరిగితే దాని చుట్టూ ఎలాంటి సామాజిక పరిస్థితులు వున్నాయి? నేరం జరగడానికి కారణాలు ఏమిటి? పిల్లల ఎదుగుదలలో పేరెంట్స్ పాత్ర ఏమిటి? కౌమారదశలో పిల్లలు ఎలాంటి ఆత్మనూన్యతకు లోనౌతున్నారు? ఇలాంటి చాలా కీలకమైన అంశాలని ఏ సైడ్ తీసుకోకుండా ఒక మంచి చర్చకు దారితీసినట్లుగా ఈ సిరీస్ చిత్రీకరించారు. వీలుకల్పించుకుని చూడాల్సిన సిరీస్ అడాలసెన్స్.