“2026 మార్చ్ 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకలిస్తాం” కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రతిజ్ఞ ఇది. సాధారణంగా మావోయిస్ట్ ల విషయంలో ఆర్మీ రంగంలోకి దిగదు. కాని అబూజ్మడ్ అభయారణ్యంలో జరుగుతోన్న అంతిమ యుద్దంలో ఆర్మీ పరోక్షంగా రంగంలోకి దిగుతోంది. గతంలో సిఆర్పీఎఫ్ లేదంటే కోబ్రా దళాలు పని చేసేవి. ఆ రెండింటి కంటే కీలక పాత్ర గ్రేహౌండ్స్ దళాలది. మావోయిస్ట్ లపై ఆర్మీ దిగడం అనేది తమ దేశ పౌరులను ఆర్మీతో చంపించినట్టే అనే రీతిలో భావించేవాళ్ళు. అందుకే ఆర్మీని గత రెండు దశాబ్దాలలో రంగంలోకి దించలేదు.
కాని ఇప్పుడు బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, కంకేర్, గడ్చిరోలి సహా 7 జిల్లాల్లో ఉన్న అబూజ్మడ్ అభయారణ్యంలో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లు భారీ ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటికే చత్తీస్ఘడ్ ప్రభుత్వం నారాయణపూర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి సర్వే కూడా చేయించాలని ఆదేశించింది. ఇక ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ను బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సహా ఇతర కంపెనీల బలగాలు ఏర్పాటు చేస్తున్నాయి. భారీ ఎత్తున అడవుల్లో సెల్ టవర్ లు, హెలిప్యాడ్ నిర్మాణాలు కమ్యూనికేషన్ హబ్ లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు.
ఇదంతా అన్నలపై పోరు కోసమే కేంద్రం చేస్తోంది. బీఎస్ఎఫ్ ను రంగంలోకి దించడం ఒక ఎత్తు అయితే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం మరో ఎత్తు. అంతు చిక్కని కొండలతో ఉండే అభయారణ్యంలో ఇది ఓ సాహసమే. 30 వేల మంది కూడా లేని పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ఎదుర్కోవడానికి దాదాపు లక్ష మందితో కూడిన బలగాలు దిగుతున్నాయి. వారి కోసం దాదాపు 20 వేల ద్విచక్ర వాహనాలను, పెట్రోల్ ట్యాంక్ లను కూడా పంపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో బలగాలు ద్విచక్ర వాహనాలతోనే వెళ్ళాయి.
అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… వచ్చే ఎన్నికల్లో బీజేపికి అనుకూల పవనాలు అయితే ఉండకపోవచ్చు. అందుకే కేంద్రం కూడా బిల్లులు ప్రవేశపెట్టే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది. పీవోకే ని స్వాధీనం చేసుకునే ఆలోచన కూడా ఆపింది. హర్యానా సహా కీలక రాష్ట్రాలను బిజేపి కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అమిత్ షా… వామపక్ష తీవ్రవాదాన్ని బిజెపి అణచివేసింది, మావోయిస్ట్ ల ముప్పు నుంచి దేశాన్ని విముక్తి చేసింది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
ఆ లోగా అనుకున్న లక్ష్యాన్ని అమిత్ షా అందుకుంటే… మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, తెలంగాణా, బీహార్, సహా పలు రాష్ట్రాల్లో బిజెపికి బలం పెరుగుతుంది. గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందిస్తే కచ్చితంగా తమ వైపు తిరుగుతారు అనే ధీమాలో కూడా అమిత్ షా ఉన్నారు. అసలు ఏదీ జరగకపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా మావోయిస్ట్ లను తుడిచిపెట్టిన ఘనత అమిత్ షాకే దక్కుతుంది. కొండపల్లి సీతారామయ్య చత్తీస్ఘడ్ లో వేసిన పునాదిని కదిల్చే సాహసం చేస్తున్న అమిత్ షాకు ఇది రాజకీయంగా కచ్చితంగా బలం చేకూర్చే అంశమే. అందుకే ఈ విషయంలో హోం మంత్రి వెనకడుగు వేయడం లేదు. మావోలకు రెండే ఆప్షన్ లు ఇచ్చారు, లొంగిపోవడం లేదా చచ్చిపోవడం. భవిష్యత్తులో బలగాల దాడులు ఇంకా కఠినంగా ఉంటాయనేది సోమవారం అమిత్ షా మరింత క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అంతిమ యుద్ధం ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి.