భలే చిత్రంగా వుంది నిన్నటికి నిన్న వైకాపా అనుకూల దినపత్రిక సాక్షి అందించిన ఓ కథనం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాలలో గెలిచినా కూడా కోర్టుకు వెళ్లడానికి వైకాపాకు అవకాశం వుందట. అదీ ఆ వార్త వెనుక వున్నసంబరం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కు తేదేపా అభ్యర్ధి తరపున ప్రచారం చేసే సెలబ్రిటీ క్యాంపయినర్ల జాబితా సకాలంలో ఇవ్వలేదట. అందువల్ల ఆ క్యాంపయినర్ల ఖర్చు అంతా టీడీపీ అభ్యర్థి ఖాతాలొ పడుతుంది. అలా అయితే ఖర్చుమొత్తం పెరిగి నిబంధనలు అతిక్రమించినట్లు అవుతుంది. అదీ ఆ వార్త వైనం.
ఆ సంగతి సరే, ఆదికి ముందే, ఇంకా కౌంటింగ్ కాకుండానే, దేశం గెలిస్తే, కోర్టుకు వెళ్లే అవకాశం వుందోచ్ అని వార్త రాయడం అంటే ఏమనుకోవాలి? సర్వేలు చెబుతున్న దేశం అభ్యర్థి విజయాన్ని పరోక్షంగా పక్కా చేసేసినట్లే అనుకోవాలా? ‘’….ఒక వేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించినా దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది…’’ ఇదీ సాక్షి పేర్కొంటున్నది. అంటే ఆట సరిగ్గా ఆడగపోయినా, చెప్పడానికి లేదా, మరో విధంగా ఆటలో గెలవడానికి సాకులు బాగానే రెడీ చేసుకుంటున్నారన్న మాట వైకాపా జనాలు. సాక్షి వార్తలోని అర్థం, పరమార్థం అదే కదా?