జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తనపై బురద చల్లడం, తన తల్లిపై నిందలు వేయడం అంతా టీడీపీ చేయిస్తోందంటూ ఆరోపించారు. టీడీపీ బాసులకు కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారంటూ టీవీ 9 రవి ప్రకాష్, శ్రీనిరాజు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల ఫొటోలు పెట్టి ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కూడా ఈ టీమ్ లోని వారే అంటూ మరో ట్వీట్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి స్పందిస్తూ… ప్రత్యేక హోదా అంశం కంటే వ్యభిచారం చట్టబద్ధం చేయాలనే అంశంపైనే ఈ ఛానెళ్లు ఎక్కువ దృష్టిపెడుతున్నాయనీ, ‘ఈ మీడియాను కంట్రోల్ చేస్తున్న వ్యక్తిగా మీ ప్రాధాన్యత ఏంటో చెప్పాల’న్నారు. వర్మ, శ్రీనిరాజు, రవి ప్రకాష్ ల ద్వారా మంత్రి నారా లోకేష్, అతని స్నేహితుడు కిలారు రాజేష్ కలిసి ఈ బురద చల్లే కార్యక్రమం చేయిస్తున్నారని చంద్రబాబు తెలియదంటే ఎవరు నమ్ముతారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
సచివాలయం వేదికగా టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోపాటు ఇతర కొన్ని ఛానెళ్లు, సోషల్ మీడియా ద్వారా గత ఆరు నెలలుగా తనపైనా కుటుంబంపైనా అభిమానించేవారిపైనా నివధిక మీడియా అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారంటూ తీవ్రంగా పవన్ స్పందించారు. దీని కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఛానెళ్ల టీఆర్పీల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం 70 ఏళ్ల తన తల్లిని చర్చల్లోకి లాగుతున్నారంటూ ఆరోపించారు. ఈ వివాదంతో సంబంధాలున్నాయంటూ ఏకంగా కొంతమంది ప్రముఖులపై పవన్ కూడా బురద చల్లే కార్యక్రమం మొదలుపెట్టారనే చెప్పాలి. అంతా టీడీపీ చేయిస్తోందని, ముఖ్యమంత్రికి ముందే తెలుసని, ఆయనే మీడియాని నియంత్రిస్తున్నారని పవన్ ఆరోపించడం సంచలనమే. కానీ, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపితే బాగుండేది. నిజానికి, మీడియాని శాసించగలిగే స్థాయి చంద్రబాబుకి ఉంటే… తన కుమారుడు నారా లోకేష్ పై పోసాని లాంటివాళ్లు చేసిన ఆరోపణలు యథేచ్ఛగా మీడియాలో ఎలా ప్రసారమయ్యాయి..? ఆ స్థాయి నియంత్రణే ఉంటే వాటిని ఆపుకునేవారు కదా!
ఆరు నెలలుగా తనపై కుట్ర జరుగుతోందన్న విషయం పవన్ కి తెలిస్తే.. ఇన్నాళ్లూ ఒక్క మాటా మాట్లాడలేదే..? ఈ వరుస ట్వీట్లు చూస్తుంటే పవన్ గందరగోళానికి గురౌతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఆయనకైనా స్పష్టత ఉందా అనే అనుమానం కలుగుతోంది. టీఆర్పీల కోసమే న్యూస్ ఛానెల్స్ ఇదంతా చేస్తున్నాయని చెబుతున్నారా..? చంద్రబాబును ప్రసన్నం చేయడం కోసమే సదరు ప్రముఖులు ఈ వివాదం రాజేస్తున్నారని అంటున్నారా..? లేదా, మహిళలపై దాడి ఇది అని పవన్ చెప్పాలనుకుంటున్నారా..? ఇంకోటి.. ప్రత్యేక హోదా కంటే ఈ అంశానికే మీడియా ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు. నిజానికి పవన్ కంటే, ఇతర రాజకీయ పార్టీలకంటే ముందుగానే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నది మీడియానే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిందీ ఈ మీడియానే. ఈ విషయం పవన్ గమనించలేదేమో?